3259* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

సాఫీగా - అలవోకగా - 3259* వ శ్రమ కార్యక్రమం!

         ఇది శుక్రవాసరం - 11-10-24 వేకువ 4,15-6.20 నడిమి సమయం! అప్పుడక్కడ – 16 వ రహదారి – 22 వ కిలోమీటరు వద్ద వీధి శ్రమదాన ఉద్యుక్తులు అరడజను మందే! బహుశా ఆ చిన్న సంఖ్యకు కారణం అంతకుముందు తగులుకున్న వర్షం కావచ్చు! కాని, నిముష క్రమంలో వాళ్ల బలగం  పెరిగి పెరిగి 31 దగ్గర ఆగింది!

         ఈ 31 వ వారు లంకపల్లికి చెందిన - పర్యావరణం బెంగపట్టుకొన్న 73 ఏళ్ల ...... .. గారు! ప్లాస్టిక్ తుక్కుతో ఈ భూమి మీద జీవరాసులకు అంతిమకాలం సమీపిస్తున్నదనే తన గోడును స్వచ్ఛ కార్యకర్తలతో పంచుకోవడానికే వారు ఆ వయసులో తొలి ప్రొద్దుకు మున్నే గంగులవారిపాలెం దగ్గరి శ్రమదాన స్థలం  చేరుకొన్నారు!

         మిగిలిన 30 మందిలో రైతులూ, బేహారులూ, గృహిణులూ, ఎక్కువగా పెద్దలూ, తక్కువగా పిన్నలూ కాక – 3 ½ మంది డాక్టర్లు! (అంటే చివరి ½ సంఖ్య విజయవాడలో వైద్య విద్యనభ్యసిస్తున్న దాసరి రమ్యశ్రీ – ఒకప్పటి హీరో షోరూం అధినేత గారి కుమార్తె!)

         వేకువ 3½ కే లేచి, మూణ్ణాలుగు కిలోమీటర్లు దాటుకొని, కత్తీ కటార్లతో కాలుష్యం మీద సమర సన్నద్ధులయ్యారు సరే – వాళ్ళ కార్యాచరణమేమిటి?

         అంతకుముందే కురిసిన వాన వల్ల తడితడిగా, జారుడుగా మారిన 4 చోట్ల ఏం సాధించారయ్యా అంటే:

1) ఇద్దరే ఇద్దరు కార్యకర్తలు నూకలవారిపాలెం డొంక వద్ద రాదారి దక్షిణాన గడ్డినీ వ్యర్ధాలను పోగు చేసి, దానితో పోలానికీ, పచ్చని రోడ్డు మార్జిన్ కూ అందంగా హద్దును గీయడం,

2) ఐదారుగురు సుందరీకర్తలు బాట ఉత్తరపు కొసను ఊడ్చి ఊడ్చి శుభ్రం చేయడం,

3) అరుగో – దారికి ఉత్తరం దిగువన రాటు తేలిన 15 మంది ఎడం వాటం వారూ, జోడు కత్తుల వారూ, దంతెధారులూ, ముళ్ళ కంపల నడుమ పని నిపుణులూ! వాళ్లు సాంతూరి వీధి నాణ్యత కోసం చేస్తున్న శ్రమను ఎంతసేపు చూసినా, ఎంతగా వర్ణించినా తనివి తీరదు!

4) ఇక్కడికొక కిలోమీటరు దూరాన ఐదుగురు హార్డ్ కోర్ కార్యకర్తల నెల నాళ్ల వీధి భద్రతా/శుభ్రతా చర్యలు నేటితో ఒక కొలిక్కి వచ్చాయి!

         6.25 కు జరిగిన సమీక్షా సభను –

సుస్పష్ట స్వచ్చ – సుందర – నినాదాలతో ప్రారంభించినది దాసరి శ్రీనివాసుల వారూ,

         నేటి వాలంటీర్ల కష్టాన్ని వివరించినది DRK వైద్యుల వారూ, మరియూ రేపటి శ్రమ స్ధలి 216 వ జాతీయరహదారి - 22 వ కిలోమీటరు వద్ద అని ఆమోదించిన అందరూ!

         ఒకానొక ప్రవాసాంధ్రుడు

అహోరాత్రులు చల్లపల్లిని అంతరంగంలోన నిలిపెను

ఐక్యరాజ్యపు సమితిలో మన స్వచ్చ జెండా ఎగురవేసెను

వంద పైగా కిలోమీటరు పరుగుతో మన పరువు నిలిపెను

అది గదా మన ఊరి మేలుకు సర్వశక్తులు ఒడ్డుటంటే!

- నల్లూరి రామారావు

   11.10.2024