పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
చూడ ముచ్చటగ – 3260* వ శ్రమ వేడుక!
12.10.94- శనివారం నాడు – ఇటు ఊళ్లో చాలా చోట్ల దసరా ఉత్సవాల సందళ్లూ, అటు ఊరికి సుదూరంగా వేకువ 4.15 నుండే 216 వ రహదారిని మొక్కలతో హరిత సుందరీకరిస్తున్న 31 మంది స్వచ్చంద శ్రమదాతల తలా గంటా యాభై నిముషాల ప్రయత్నాలు!
అంతకు ముందుగా కురుసు కొంటూ వెళ్లిపోయిన వానతో తడిసి, కాలుజారుతున్న 100 + 20 గజాల రోడ్డు మార్జిన్ల దిగువన - సుమారు 55 ఏళ్ల సగటు వయస్కుల శ్రమ దృశ్యాల కన్నా అందమైనవి నాకు కనిపించవు!
తమ గ్రామమూ, చుట్టు పట్ల ప్రదేశాలు, ఏ కోణం నుండి చూసినా – ఆహ్లాదకరంగా- సద్భావనా ప్రేరకంగా కనిపించాలనే పదేళ్ల ప్రగాఢ ఆకాంక్షకు ప్రతిబింబాలు ఈ దృశ్యాలు!
మరి- ఈ విశిష్ట సన్నివేశ కల్పకులెవరయ్యా అంటే- వయసును బట్టి వృద్ధులనబడే 10 మందీ, రోజువారీ ఇంటి బాధ్యతల్లో తీరిక లేని గృహిణులూ, ఉద్యోగినీ ఉద్యోగులూ, 8 గంటల తర్వాత పొలం పనులకు వెళ్లవలసిన రైతులూ, వృత్తికారులూ !
అవసరమైనప్పుడు మోకాలి బంటి మురుగులో దిగేందుకూ, చెట్టు కొమ్మలపై కెగబ్రాకేందుకూ, వీధి గుంటలు పూడ్చేందుకూ, మొక్కల ముళ్ల కంచెల్లో దూరేందుకూ సంసిద్దులు!
ఇది ఊరి బయట రహదారేగాని, కొద్దిపాటి వానలకే ఉత్తరపు జాగా కోసుకుపోతే ఈ వేకువ దొరికిన వ్యర్థాలతోనే ఇద్దరు ఆ గండ్లు పూడుస్తుంటే చూశాను!
60 -70 ఏళ్ల పెద్దలు ప్రయాణికులు విసిరిన ప్లాస్టిక్ సంచులూ, సీసాలూ ఏరుతుంటే గమనించాను!
వాలుగా- గజమున్నర లోతుగా పల్లంలోకి దిగి, పిచ్చి- ముళ్ల- చెట్లను తొలగిస్తున్న 10 మంది కష్టమూ నా కంట బడ్డది! కష్టాలను ఇష్టాలుగా మార్చుకొని, పనిలో ఆనందాన్ని కనిపెడుతున్న అనుభవజ్ఞులు వీళ్లు!
ఈ 30 మంది సహనమూ, స్వచ్చ- సుందర స్వప్నమూ, స్వగ్రామ సర్వతోముఖ వికాసమూ త్వరగా ఫలించాలని కోరుకుందాం!
నేటి పనులు ముగిశాక - జాస్తి ప్రసాదు గారు ముమ్మార్లు ప్రకటించిన ఊరిస్వచ్చోద్యమ ఆకాంక్షల నినాదాలూ, రేపటి ఉదయము వారి నివాసం వద్ద అల్పాహార స్వీకారార్థం కార్యకర్తలకు ఆహ్వానమూ,
అందు మూలంగా రేపటి మన శ్రమదానం కమ్యూనిస్టు వీధి ఉత్తరపు కొసన- దాసరి రామ మోహనరావు గారి ఇంటి దగ్గర జరుగుననే విషయమూ తెలిశాయి!
మంచి పుటను లిఖించుకొందాం!
అయ్యలారా! అమ్మలారా! చల్లపల్లి నివాసులారా!
పెద్దలారా! పిన్నలారా! గద్దె దక్కిన ప్రభువులారా!
మన సురేష్ నాదెళ్ల కష్టం వృధాగా పోగూడదంటే
ఊరి కోసం మనం సైతం ఉద్యమిద్దాం - సహకరిద్దాం!
మనకు గూడ చరిత్రలో ఒక మంచి పుటను లిఖించుకొందాం!
- నల్లూరి రామారావు
12.10.2024