పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
కమ్యూనిస్టు వీధికి మారిన శ్రమదానం! - @3261*
ఆదివారం (13-10-24) ప్రభావం వల్లనేమో - అసలు కార్యకర్తలూ, కొసరు కార్యకర్తలూ, అతిథులూ, అతిధేయులూ మొత్తం 51 మందితో 6.45 దాక ఆ 2 వీధుల్లో సందడే సందడి!
సామ్యవాద వీధి మంచిదే, ఊళ్లోకల్లా స్వచ్చ - శుభ్ర, సుందరమైనదే గాని, ప్రక్కన సాగర్ టాకీసు బాటా ఉన్నంతలో హరిత పుష్పసంభరితమే గాని, ఆ ఉత్తరం ప్రక్క డ్రైను సంగతేమిటి? క్రిక్కిరిసి పెరిగిన క్రోటన్ల - గానుగ చెట్ల కొమ్మల సంగతీ!
పని జరిగింది 150 గజాల మేరకే గాని, పెద్దగా చేసినట్లు కనిపించలేదు గాని, 6.00 కు చూస్తే ట్రాక్టరు వ్యర్ధాలతో ఎలా నిండింది? 30 మందికి చెమటలెందుకు పట్టెను? ఏడెనిమిది మంది బట్టలకు మురుగు మరక లేల వచ్చెను? 4 గురైతే పని ముగిశాక అలసటతో సగం పడుకొన్నారెందుకు?
అందరి ముఖ కమలాల్లో అలసట ఉంది గాని, సంతృప్తికి లోటు లేదేల? “ఛ! ఇక రేపటి నుండీ కొన్నాళ్ల పాటు శ్రమదానానికి రాను” అని ఏ ఒక్కరూ అనుకోలేదెందుకు?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కనుగొంటే - చల్లపల్లి స్వచ్చ - సుందరోద్యమం ఎందుకు 10 ఏళ్లగా విజయవంతమౌతున్నదో తెలిసిపోతుంది!
“వాళ్లవి ఉక్కు శరీరాలు, వజ్ర సంకల్పాలు....” అని అతిశయోక్తులు ఎన్నైనా రాయవచ్చు గాని, కేవలం మామూలు మనుషులుగా కన్పించే ఈ కార్యకర్తల కార్యదీక్ష, మొండి పట్టుదల సామాన్యమైనవి కాదనేది మాత్రం వాస్తవం!
ఇందులో ఎవరి ప్రయత్నమేదనీ, ఏ మురుగు గుంట ఒడ్డునెవరు బాగుచేశారనీ, అటు కమ్యూనిస్టు వీధినీ, ప్రక్కన ఉపమార్గాన్ని ఏ మహిళలు శుభ్రపరిచారనీ.... వివరంగా వ్రాయలేను గాని... నేటి స్థలం మారినందుకు అందరి ఉమ్మడి ప్రయత్నం విజయవంతమైందని మాత్రం చెప్పకుండానే తెలిసిపోతున్నది!
అసలు నేటి పని పాటులు NH 216 నుండి ఎందుకు మారిందంటే - జాస్తి ప్రసాదు - దాసరి లక్ష్మీరాణి గార్ల ఇటీవలే వివాహితులైన కొడుకూ - కోడలూ హేమంత్ కూ నిశ్చలకూ త్వరలో ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీడ్కోలు నిమిత్తమే! ఆ సందర్భంలో
ఉద్యమ నినాదాలు దద్దరిల్లింది కోడూరు వారి నుండి;
కార్యక్రమ సమీక్షా వచనాలు DRK వైద్యునివి;
వధూవరుల, వారి పెద్దల నుండి ఉద్యమ ఖర్చులకై వచ్చిన 2 లక్షల బరువును స్వీకరించడానికి బాగా పనికొచ్చింది నేను;
వధూవరుల్ని ఆశీర్వదించిందీ వారి భూరి ఆతిధ్యం స్వీకరించిందీ అందరూ;
రేపటి వేకువ మళ్లీ మన శ్రమస్థలం 216 వ రaహదారి మీద వంతెన వద్ద !
చల్లపల్లికి సార్థకత చేకూర్చు కొరకే!
అమెరికాలొ – కనెక్టికట్ లో స్వచ్చ సుందరపల్లి బ్యానరు!
మండుటెండలొ మహా పరుగుకు మన సురేష్ నాదెళ్ల హాజరు
అదంతా ప్రఖ్యాతి కొరకో - ధనార్జనకో అనుకొనేరు!
స్వచ్ఛ సుందర చల్లపల్లికి సార్థకత చేకూర్చు కొరకే!
- నల్లూరి రామారావు
13.10.2024