3262* వ రోజు ....

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

3262* వ సామూహిక శ్రమ!

         ఇది సోమవారం - 14.10.24 వ వేకువ 4.17 కే మొదలై, వానదేవుడు బాగా కవ్వించి, అతని మిత్రుడు వాయుదేవుడు కాస్త కరుణించగా – 216 వ నేషనల్ హైవే మీద - బండ్రేవు కోడు మురుగుకాల్వ వారధి దగ్గర జరిగిన కష్టమైన – క్లిష్టమైన శ్రమ!

         శ్రామికుల సంఖ్య గాని, శ్రమ పరిమాణము గానీ పొదుపు పాటించబడినవి. దాని తొలి కారణంబేమనగా – బెంగాల్ అఖాతంబున పుట్టుచున్న వాయుగండమట! మలి కారణము చిన్న పిల్లలాటలాగా వాన జల్లులు శ్రమకారులతో మాటిమాటికీ ఆడుకోవడమే!

         వాన పడుచు, చలి వేస్తున్నప్పడు స్వచ్ఛ కార్యకర్తలే మాత్రమూ లెక్కచేయక – కొన్నిమార్లు సవాలుగా తీసుకొని, తామనుకొన్న పనులు పూర్తి చేయుట పరిపాటే గాని, పని జరిగే చోటొక చీకటి గుయ్యారమూ, మరియు అచట గల ముళ్ళనూ, సీసా ముక్కల్నీ , గుంటల్నీ కాచుకొనుచూ చేయడమెట్లైననూ కష్టమే గదా!

         ఐతే మాత్రమేమాయెను? జల్లులు పెద్దవైనపుడు కార్యకర్తలు పని మానిరా? ఇంత చల్లని వాతావరణ మందు కూడ వారిలో 4 గురి నుండి నాకు చెమట కంపు సోకలేదా? నా మక్కుపుటములదరినప్పుడు “ఆ చెమట కంపులే మన గ్రామ భవితకు ఇంపుసొంపులనే, ఊరి స్వచ్చ - సుందర – హరిత సౌభాగ్యానికి శ్రీరామరక్షలని” నేను భావించలేదా?

         అసలీ ఉరుములు – మెరుపుల – గాలుల వాతావరణంబున, ఊరికి, సుదూర ప్రదేశంబున, తన గ్రామ సుస్తికై కష్టించుకున్న సంగతి సహృదయ గ్రామ సోదరుల హృదయాలను కలుక్కుమనిపించవా? అప్పుడప్పుడైనా స్వచ్ఛ కార్యకర్తలకు సహకరించవలెననిపించదా?

నేటి అసౌకర్య వాతావరణంబులోనూ :

- కొన్ని ప్లాస్టిక్ తుక్కు లేరబడినవి! వానకు మట్టి కోసుకుపోయి, పడిన 3 గండ్లు పూడ్చబడినవి!

- అందరి దుస్తులూ అటు చెమటతోనో - ఇటు వానతోనో తడిసి ముద్దైనవి!

         వానలోనే తలా కాస్త కాఫీ కషాయము సేవించబడినది, ఆపైన మాలెంపాటి అంజయ్యగారు చొరవ ప్రదర్శించి, గట్టిగా చేసిన నినాదములు తక్కిన కార్యకర్తలచే పునరుద్ఘాటించబడినవి!

         రేపటి రహదారి శ్రమకై NH216 మీది  22 వ కిలోమీటరు రాయి వద్దకు చేరుకోవలెనని కూడ ప్రకటితమైనది!

         చల్లపల్లి స్వచ్ఛ బ్రాండు

“గ్రామం దరిదాపుల ఏ కాలుష్యం మిగలరాదు

పండ్ల - పూల మొక్కలకడ కలుపన్నది ఉండరాదు

చల్లపల్లి స్వచ్ఛ బ్రాండు జగమంతా వెలయా” లని

కష్టించిన వారికెల్ల సాష్టాంగ నమస్కారం!

- నల్లూరి రామారావు

 

   14.10.2024