3263* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

3263* వ శ్రమ విశేషాలు. (బుధవారం - 16.10.24)

         మొదటి విశేషం – “4.30 - 6.00 వేకువలో మన వీధి పారిశుద్ధ్య కృషి” అనే నిర్ణయాన్ని పట్టించుకోక -4.04 కే - అదీ ఊరికి దూరంగా - NH216 మీద – 22 వ కిలో మీటరు రాయి వద్ద కొందరు అత్యుత్సాహవాంతులు కన్పించడం!

         దక్షిణపుటాకాశాన ఉరుములు - మెరుపులు వినీ, చూసి కూడ మొత్తం 27 మంది - అసలంతకు ముందే పడిన వానను లెక్కచేయక రహదారి అలంకరణకు దిగడం రెండవ విశేషం!

         ఇద్దరు సెమీ దివ్యాంగులు వాతావరణానికి కాస్త తటపటాయించి, బయల్దేరి, ఇంటి వద్దనే చేతొడుగులూ, పనిముట్లూ ధరించి (ఇదంతా ఆలస్యాన్ని కవర్ చేయడానికట!) ప్రధాన శ్రమ స్రవంతికి దూరంగా 6.00  దాటినా – విజిలు కూసినా - పనిచేసుకుపోవడం 3 వ వింత!

         ఇక 3-4 విశేషాలు ఏమని వివరించేది!

- “గున్నమామిడీ కొమ్మ మీదా గూళ్లు రెండుండేవి...” అనే పాటలాగా - ఒక విశ్రాంత ఇంజనియరూ, అంతకన్నా పెద్ద చెక్ పోస్టూ - అదేంటో ఆ ఇద్దరూ ఏ రోజైనా ఒక చోటే శ్రమిస్తారు – కబుర్లాడుకొంటూ శ్రమదానాన్ని వేడుకగా మార్చుకోవడమూ,

- ఏడెనిమిది మంది కత్తుల బ్యాచ్చి బురదలో కాలుదిగుతుంటే చాకచక్యంగా పిచ్చి చెట్ల పనిబట్టడమూ,

         5 వ విశేషం 15 రోజులుగా అరుణాచల యాత్ర చేసి వచ్చిన ప్రాతూరి పెద్దాయన నూతనోత్సాహంతో తన వెనుకటి గుణం మానక – కార్యకర్తలకు కేకులు తినిపించడమూ, ఆ పక్షం రోజుల ప్రశాంత జీవితాన్ని వివరించడమే!

         నాకనిపించిన 6 వ విశేషం - ఇద్దరు మహిళా నర్సులు పూల మొక్క పాదుకున్న ముళ్ల కంచెలో దూరి, కలుపు తీసి, మొక్క పట్ల ప్రేమను చాటడం!

         10 ఏళ్ళ శ్రమదాన కానుకగా 10 లక్షలు ఈ శ్రమదానోద్యమానికి సమర్పిస్తున్న వ్యక్తి తన పేరును, వివరాలను బహిరంగపరచరాదనే షరతు విధించడం చిట్ట చివరి విశేషం!

         తరచి చూసే వాళ్లకు ఈ శ్రమదాన ఘట్టంలో ఇలా ఎన్ని ప్రత్యేకతలైనా కన్పిస్తాయి!

         6.07 కు గాని కాఫీలకు వెళ్లిన పాటలాయన తిరిగి రాక – గబగబా హారన్ కొట్టుకొంటూ (అసలాతనికి హారనెందుకు? బండి మీద కూడ పాట చరణాలు పాడుతుంటే?) రాగా –

         15 నిముషాల చివరి సమావేశంలో శాస్త్రి గారు నినాదాలందుకొని, DRK గారు దాచుకోకుండా ఆనందాశ్చర్యాలు ప్రకటించి,

         రేపటి ఉదయం ఇద్దరు పెద్దలందించబోయే భూరి విరాళం ఇదే NH 216 - వంతెన వద్దనే అని తేల్చేశారు!

         మన ప్రాంతంలో పోలీస్ ఉన్నతోద్యోగిగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న బత్తిన  శ్రీనివాస్ – ఉమాదేవి దంపతుల నెలవారీ విరాళం 5,000/- ఆన్లైన్ లో ధన్యవాదపూర్వకంగా స్వీకరించడమైనది.

         కృష్ణాజిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్  శ్రీ గొర్రెపాటి గోపీచంద్ గారు తమ కుమారుడు .. . .. . . .. పంపిన లక్ష రూపాయల చందా చెక్కును తన మిత్రద్వయం - దిలీప్, బసవ శంకర్ రావులతో కలిసి వచ్చి ‘మనకోసం మనం’ మేనేజింగ్ ట్రస్టీకి ఇచ్చినందుకు బహుదా ధన్యవాదములు.

         ఆమె సొగసులు చూడతరమా!

చల్లపల్లను సుందరాంగికి వచ్చెనట దశవర్షప్రాయము

ఇప్పటికె ఆ హరిత సంపద, ఇంతలింతగ స్వచ్ఛ శుభ్రత

రాష్ట్ర మందున, దేశమంతట ప్రజానీకం నోళ్ల లోపల

నానుచున్నది – ముందుముందిక ఆమె సొగసులు చూడతరమా!

- నల్లూరి రామారావు

   16.10.2024

 

కృష్ణాజిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ శ్రీ గొర్రెపాటి గోపీచంద్ గారు తమ కుమారుడు .. . .. . . .. పంపిన లక్ష రూపాయల చందా చెక్కును తన మిత్రద్వయం - దిలీప్, బసవ శంకర్ రావులతో కలిసి వచ్చి ‘మనకోసం మనం’ మేనేజింగ్ ట్రస్టీకి ఇచ్చినందుకు బహుదా ధన్యవాదములు.