పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
వానతో సయ్యాటలుగా - 3265* వ శ్రమదానం!
హూణ లెక్కయితే 18-10-24, తెలుగు సాంప్రదాయ ప్రకారమైతే ఆశ్వీజ బహుళ శుక్రవాసరపు వేకువ 4.15-6.10 సమయం.
2 రోజుల జలుబూ – జ్వరమూ శాంతించి వచ్చిన పార్వతితో సహా 216 వ రహదారి వికారాల మీద పోరు సలుపుతున్న 24 మంది!
వాళ్లను తడుముతూ, నాలుగైదు మార్లు పరామర్మించిన వానదేవుడూ, దేశంలో ఎక్కడా కనిపించని సామాజిక - సామూహిక శ్రమదానం చూడాలని మబ్బుల్ని తొలగించుకోలేక అవస్థ పడుతున్న సూర్య భగవానుడూ,
రోడ్డు ఉత్తరపు లోతట్టున – వరిపొలం ఆనుకొని ఏపుగా పెరుగుతున్న గడ్డినీ, పిచ్చిమొక్కల్నీ తునుమాడుతూ - ఈగలూ, దోమలూ కరుస్తున్నా పట్టించుకోని నలుగురైదారుగురు మహిళా కార్యకర్తలూ,
దీనికి భిన్న దిశలో వక్రంగా పెరగాలని చూస్తున్న చెట్లను లాగి, త్రాడుతో బిగించి, క్రమశిక్షణ నేర్పుతున్న రైతు ప్రముఖులూ, వృత్తినిపుణులూ,
అదోరకంగా – నడుమువాల్చి కార్యకర్తలకు మంచి నీళ్లందిస్తున్న వృద్ధాతి వృద్ధుడు,
“నభూతో..” అనదగిన ఈ స్వచ్ఛ సుందర - శ్రమజీవన దృశ్యాల్ని కెమేరాలో బంధిస్తున్న మరొక వృద్ధ ఛాయా గ్రాహకుడూ,
ఇంకో పది నిముషాల్లో నిర్ణీత సమయం ముగుస్తుండగా దడదడ-బడబడా-ఎడాపెడా వాయించాలని చూసిన వానగాడూ,
తానురా వీలు పడక - ఎంత వేకువనో లేచి ఇందరికి అట్ల అల్పాహారం షణ్ముఖునితో పంపిన – వద్దని బ్రతిమాలినా వినని డొక్కా అన్నపూర్ణా,
తడుంకోకుండా స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలు ప్రకటించిన కళాశాలోపన్యాసకుడు వేముల శ్రీనివాసుడూ,
రానున్న ఏడెనిమిది రోజుల శ్రమదాన ప్రణాళికను – (చెక్ పోస్టు వారు సహకరిస్తుండగా) వివరించిన DRK వైద్యుడూ,
శని - ఆదివారాలు మాత్రం NH216 మీదనే శ్రమదానమని అంగీకరించిన అందరూ....!
అట్టి చిక్కటి నిబద్ధతకే
ఇన్ని ఏళ్ళని హద్దు లేదే, ఇంతవరకని పరిధి లేదే,
వల్లకాడో – మురుగుకాల్వో - బురదగుంటొ వివక్ష లేదే!
గ్రామమునకొక మంచి జరుగుటె కావలెను ఈ కార్యకర్తకు!
అట్టి చిక్కటి నిబద్ధతకే వందనములభివందనమ్ములు -
- నల్లూరి రామారావు
18.10.2024