పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
శనివారం పని దినం సంఖ్య – 3266*
19.10.2024 వేకువ శ్రమదాతల లెక్క 27 మాత్రమే! ఆత్రపడిన 6-7 గురు మాత్రం మరీ 4.15 కే అక్కడ తయారు! అక్కడి నుండి అక్షరాలా 6.25 వరకూ రకరకాల పనులే చేశారో - ఊరి ఇతర వీధుల్ని ఎప్పుడెలా సంస్కరించాలనే చర్చలే జరిపారో 4-5-6 నిముషాల కాఫీలు ముగిసి సమావేశమే నిర్వహించారో- వాళ్లు నిద్ర లేచాక ఇంటికి చేరేది లెక్కేస్తే 3 గంటల విలువైన సమయం!
వీళ్ళు ఊరి నిమిత్తం పడే తపనలూ, తిప్పలూ అలా ఉంచండి - విదేశాల్లో, ఇతర ప్రదేశాల్లో ఉండి, ఈ శ్రమదానంలో పాల్గొనలేక విచారిస్తున్న వాళ్ళను వదిలేయండి-ఊరి 18 వార్డులు మొత్తం 25 వేల జనాభాలో ఏనాడూ దీన్ని పట్టించుకోని సగం మంది ప్రసక్తీ వద్దు గాని,
ఇప్పుడు వస్తున్న 30-40 మందికాక-ఇంకా 100 మంది మాజీ కార్యకర్తలుండాలి-మరి వాళ్లైనా-ఈ దశాబ్ద కాల శ్రమ వేడుకల సందర్భంలో మళ్లీ చురుకుగా మారవలసిన సమయం కదా! సుమారు 150-170 మంది శ్రమ ఫలితం గదా ఇప్పటి స్వచ్చ-సుందర చల్లపల్లి!
ఉరుములూ-మెరుపులూ-మబ్బులూ తప్ప వానదేవుడు ఈ పూట శ్రమదానం జోలికి రాలేదు-6.00 AM దాక చంద్రుడూ ఆ తరువాత సూర్యుడూ 216 వ రహదారిలో గంగులవారిపాలెం వీధికి పడమరగా జరిగిన కార్యకర్తల శ్రమ విన్యాసాలకు సాక్షులుగా ఉన్నారు!
షరామామూలు గానే-కొందరి పదను కత్తుల, దంతెల డిప్పల వాడకం సాఫీగా జరిగిపోయింది! ముఖ్య సన్నివేశాలు మాత్రం ప్రస్తావిస్తాను.
- తుక్కు డిప్పల, మట్టి తట్టల, చెత్త ట్రాక్టర్ల, ప్లాస్టిక్ తుక్కుల, నాల్గుచక్రాల రిక్షాల, చీపుళ్ల, మొక్కల నాటడాల వంటి ఊరి పారిశుద్ధ్య దశవతారాల్లో Dr. పద్మావతి గారి మరో అవతారం-గడ్డి మిషన్ వాడకం ఒకటి,
- ఒక అతి భారీ కార్యకర్త (కె మహా వీర సింహుడు) కాళ్ళు వంగక-బురదలో కూర్చొని, బార్లా చాపి, సిమెంటు రోడ్డును శుభ్రపరుస్తున్నది 2 వదీ!
షణ్ముఖ/వేముల శ్రీను గారు నినదించిన సమీక్షా సభలో:
1) ఎప్పటిలాగే ఈ స్వచ్చ సుందరోద్యమం పట్ల DRK గారి ఆశ్చర్యార్ధక ముఖమూ, రేపటి వారి విదేశీయాత్రా సమాచారమూ,
2) రేపటికి మాత్రం ఈ 216 రహదారి మీదే శ్రమదానమనే సంగతీ!
ఒక చేతన-ఒక కదలిక
జివ సచ్చిన వీధులు, నిర్జీవంగా పరిసరాలు
తొడతొక్కుడుగా బ్రతుకుల గడబిడలు సహించలేక
ఒక చేతన-ఒక కదలిక ఊరిలోన తేవాలని
క్రమిస్తున్న స్వచ్ఛ కార్యకర్తలకభివందనములు!
- నల్లూరి రామారావు
19.10.2024