పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3267* వ నాడు 216 వ రహదారి మీది శ్రమదానం!
ఆదివారం శ్రమదాన సందడి ఎలా జరగాలో అలానే జరిగింది - 20-10.24 తేదీన! ఉరుముల మెరుపుల వానే 6-7 మందిని అడ్డుకోకపోతే - ఈ వేకువ కార్యకర్తల సంఖ్య 35 కు బదులు 43 కు చేరేది ! వరుణుడి శీలాన్ని శంకిస్తూనే వచ్చి రకరకాల పనులు చేసిన నవలా మణులు 9 తొమ్మిదిమందిని చూశారా!
ఊరికి 2-3-4 కిలోమీటర్ల దూరంగా - అనుమానాస్పద వాతావరణంలో 35 మంది వచ్చి చేసింది 70 మంది రహదారి సేవలకు సమానం! ఈ సగం సగం లేదా పూర్తిగా పిచ్చోళ్ళు 5 ఊళ్ళకు చెందిన కార్యకర్తలు సుమండీ! నాకు కాదు గాని, ఇలాంటి సద్యసనపరుల్ని చూస్తే క్రొత్త పరిశీలకులకు ఆశ్చర్యం కలగదా?
ఇంత చల్లని వాతావరణంలో వంచిన నడుములెత్తక గడ్డి - పిచ్చి కంపల్ని గంటకుపైగా తొలగించే అగత్యం సజ్జా ప్రసాదు + నలుగురైదుగురికేమిటో -
ఒక సందర్భంలో నడకకు బదులుగా పనితొందరలో ఒకామె పరుగెత్తే అవసరమేమిటో-
తానొక మహిళా కూలీ ఐఉండీ, వేకువనే మంగళాపురం నుండి వచ్చి చల్లపల్లి దగ్గర ఉండి శ్రమించడంలో అర్ధమేదో -
ఇంత వానా చలీ మధ్య 85, 77 ఏళ్ల పెద్దలిద్దరు ఏం సాధించాలని వచ్చారో -
ప్రమాదకర 216 వ రహదారి మీద చీకటి వేళ ఈ బ్బందం ఎన్నెన్ని శ్రమ విన్యాసాలు చేసిందో -
చివరికి - 2 గంటల శ్రమానంతరం - 6.20 కి అందమైన అర్ధచంద్రాకారంలో నిలిచి, తమ రాయపాటి రాధాకృష్ణని అనుసరించి - ఉసూరుమంటూ కాక ఉత్సాహంగా నినాదాలు పలికేదెందుకో -
6 రోజులు తాము లేని సమయంలో శ్రమదాన దిశానిర్దేశం చేసి, సకల జాగ్రత్తలు పలికిన Dr. DRK గారి మనోగతమేదో - పనిలో పనిగా నేను కూడ మైకందుకొని, అమెరికా ప్రవాసి నాదెళ్ల సురేష్ స్వచ్ఛ సుందరోద్యమం గురించి పంపిన అభిప్రాయాలను 2-3 నిముషాలు అందరికీ విన్పించడమూ -
చివరగా రేపటి వేకువ చాల రోజుల తర్వాత గస్తీ గది ప్రక్కన బందరు రహదారి వద్ద అందరూ కలుద్దామనే నిర్ణయమూ -
కార్యకర్త సదా జరుపుతున్న సమరం!
అందరి సుఖశాంతులకై అది కొందరి ఆలోచన
ఆత్మానందం కొరకై అదొక నిత్యసదాచరణ అస్తవ్యస్తతలమీద - అస్వస్త పరిస్థితిపై
స్వచ్ఛ కార్యకర్త సదా జరుపుతున్న సమరం అది!
- నల్లూరి రామారావు
20.10.2024