పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
సోమవారం (21-10-24) నాటిది 3268* వ శ్రమదానం!
4:30A.M. ఆనవాయితీని కాదని ఈ వేకువ కూడ 7 గురు 4.20 కే 6 వ నంబరు కాల్వ వద్ద గల ఆసుపత్రి వద్ద కనిపించారు. ఇక పోనుపోనూ చివరికి వాళ్ళు 27గురుగా మారారు గాని, అటు పంటకాల్వ ఉత్తరపుటంచులూ , దక్షిణాన మినీ గార్డెన్ వెలుపలా – ఇటు జూనియర్ కళాశాల ఎదుటి దాకా –
పనైతే బాగా జరిగింది గాని మరింత సమన్వయం ఉంటే ఇంకా బాగుంటుంది! వర్షమైతే ఈ పూట విశ్రాంతి తీసుకొన్నది! ATM సెంటరు కస్టమర్లతో, టీ దుకాణ వినియోగదారుల్తో, కళాశాలకు పాదాచారుల్తో జనం రద్దీ మాత్రం ఎక్కువగానే ఉన్నది!
రహదారి ప్రయాణికులు సరే – స్థానికుల్లో “ఈ వీధి పరిశుభ్ర – సుందరీకరణ బాధ్యత పంచాయతీదో – స్వచ్ఛ కార్యకర్తలదో తప్ప”, తమది కూడ అనే స్పృహ పెరిగినట్లు లేదు!
టీ కొట్టు ఎదుట ప్లాస్టిక్, పేపర్ కప్పుల సాంద్రత కొంత తగ్గింది. వంతెన దగ్గర 3 చోట్లా, గ్రేస్ ఆస్పత్రి ప్రాంగణంలోనూ పెరిగిన గడ్డిని చెక్కడానికే 15 మంది శ్రమించవలసొచ్చింది!
మిగిలిన వారు రోడ్డుతోబాటు 2 ప్రక్కలా 50 గజాల బారునా – పేవర్ టైల్స్ ను కూడ ఊడ్చి వేశారు! తుక్కంతా ట్రాక్టర్ లో ¾ వంతులు నిండింది! మట్టి మాత్రం బుల్లి ఉద్యానం లోని పూలమొక్కల మొదళ్లకి చేరింది.
2-3 వారాలు వైద్యంలో ఉన్న ఆనందరావు మళ్లీ ఆనందంగా పనుల్లో చేరి, మంచినీళ్లందంచే కర్తవ్యానికి దిగాడు!
కాఫీ కార్యక్రమం తరువాత – నేటి స్వచ్ఛ – సుందరోద్యమ బాధ్యత నెరవేర్చినది మాలెంపాటి గోపాల కృష్ణ మహోదయుడు!
రేపటి మనం కలుసుకొనే చోటు బందరు రోడ్డు లోని ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఎదుటనే!
ప్రక్షాళన ఆనాడే!
ఎప్పుడు సంకల్పించిరొ ఈ గ్రామం స్వస్తతకై –
ఎన్నడు ముందడుగేసిరొ ఈ వీధుల శుభ్రతకై
ఆముహూర్తబలమెట్టిదొ – ఆ సంకల్పం శక్తేదో
మొదలైనది చల్లపల్లి ప్రక్షాళన ఆనాడే!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
21.10.2024