3269* వ రోజు ....

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

మంగళవారం (22-10-2024) శ్రమ విశేషాలు - @3269*

          అవి విశేషాలనుకొంటే  విశేషాలే! కాదు ఈ పెద్ద ఊరినీ, పాతిక వేలమంది జనాన్నీ శతశాతం  మార్చగలమనుకోవడం భ్రమలుఅనుకునేవారికవి భ్రమలే. 

          “భూమి చదునుగా లేదు గుండ్రంగా ఉన్నది” – అంటే నమ్మారా? ఆ శాస్త్రజ్ఞుడిని శిక్షించారు!

          చెట్టు క్రింద కూర్చొన్న తన మీద యాపిల్ పండు పడితే – “అది భూమి మీదనే ఎందుకు పడ్డది ఆకాశంలోకి వెళ్ళదెందుకు?” అనే న్యూటన్ ప్రశ్నను వెర్రి ఆలోచనగా కొట్టేశారు గదా!

          “వస్తున్నాయొస్తున్నాయ్  - జగన్నాథ  రథ చక్రాల్ రథ చక్రాల్ రారండో ! రండో! రండి!..అని 85 ఏళ్ల వాడు ఒక శ్రీశ్రీ గేయం రాస్తే – “ఇదేం పిచ్చి కవిత్వంఅనుకొన్నాం గదా!

          పదకొండేళ్ల నాడు చల్లపల్లి గంగులవారి పాలెం వీధినీ, పదేళ్ల నాడు చల్లపల్లి మొత్తాన్నీ శుభ్రంచేయాలనీ, హరిత సుందరీకరణ చేస్తామనీ ఒక గ్రూపు చేసే ప్రయత్నాన్నీ అంతే!

          ఏ రోజుకారోజు బజార్లు శుభ్రపడుతుంటే 32 వేల మొక్కలు కళ్ల ముందు పెరిగి పుష్పిస్తుంటే ఇప్పటికీ ఈ శ్రమదానోద్యమం పట్ల నమ్మకం కుదరక కుదిరినా వచ్చి సహకరించని వారుంటే ఉండవచ్చు మరి!

          దశాబ్దం దాటినా ఆ నమ్మకాలతో పని లేకుండా చల్లపల్లిలో స్వచ్చ కార్యకర్తల నిష్కామ కర్మ జరుగుతూనే ఉన్నది.

          ఈ వేకువ 4-16 కే  కనీసం పదిమంది SBI దగ్గరకు చేరుకొని, వాళ్ళ బలం 25 గానూ, శానిటరీ ఇన్స్పెక్టర్  సూర్య ప్రసాదు తదితరులతో తుదకు 30 గానూ తేలింది.

          ఇప్పుడు చూడండి - 6 వ నంబరు కాల్వ పడమటి ఉద్యానం ఎంత చూడ ముచ్చటగా ఉన్నదో పింగళి మధుసూదన రావు గారి ఆస్పత్రి దాకా బందరు రహదారి ఎంతగా బాగుపడిందో  - బ్యాంకు, జూనియర్ కాలేజీ, అటూ ఇటూ కలిపి పాతిక దుకాణాల పరిసరాలన్నీ స్వచ్చ శుభ్ర సుందరంగా మారినవో!

          నేటి తుది సమావేశంలో నినాదాలు పలికింది S.I. గారు, రేపటి వేకువ చర్యల కోసం మనం కలవదగింది మునసబు వీధి  ముంగిట్లో!

          స్వచ్చోద్యమ  మనగనేమి?

బ్రహ్మ ముహూర్తాన లేచి, బజార్లలో కసవులూడ్చి,

శ్మశానమున సంచరించి, మురుగుకాల్వ సిల్టు తోడి

ఊరంతటి స్వస్తతకై  ఉరుకులు పరుగులు పెట్టే

స్వచ్చ కార్యకర్తలనెడి పిచ్చివాళ్ల స్వర్గం అది!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త

   22.10.2024