పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
ఆశ్వయుజ – ఆరుద్ర – షష్టి-బుధవాసరం - @3270*
అనగా 23-10-2024 వ వేకువ శ్రమదానం కూడ బందరు రోడ్డు భాగానికే సమర్పితం! అది 26+5 గురికి సంబంధించిన గ్రామ బాధ్యతల కోసం 4.15 – 6.10 వేళల మధ్యస్థం! 200 గజాల వీధిలో కొడవలి, గోకుడుపార, పలుగూ, చీపురు, దంతె, డిప్ప వంటి సకల శస్త్రాస్త్రాలతో –
సువిశాల రహదారి దుమ్ము దులిపి, అంచులకంటి, చట్టుగా మారిన మట్టీ - రాళ్ళ మిశ్రమాన్ని చెక్కి , గడ్డి – పిచ్చి చెట్లను వెదకి, పనిబట్టి,
మట్టిని మాత్రం మినీ ఉద్యానాల మొక్కల మధ్య చిమ్మి, పండ్ల కొట్ల లోతట్టు వ్యర్ధాల్ని లాగి, కొమ్మలూ – ప్లాస్టిక్ తుక్కుల్ని ట్రక్కులోకి ఎక్కించి,
టిఫిన్ బళ్ల - ఎంగిలాకులేరి, రక్త పరీక్ష కేంద్రాల, బార్బర్ షాపుల ఎదుట ఊడ్చి, మరోమారు వెనక్కిపోయి, ఎలక్ట్రికల్ షాపు ముందు బాగు చేసి, 1వ వార్డు ముఖద్వారాన్ని అద్దంలా మార్చి....
అసలీ కార్యకర్తలు చేయని పనేముంది? ఇలా బ్రహ్మకాలంలో అనుకొన్నచోట గుమికూడి పారిశుద్ధ్య పనులకు చొరవ చూపే నిత్య కర్మిష్టులని చల్లపల్లిలో తప్ప ఎక్కడ చూడగలరు?
రోడ్డుకు అంటుకొన్న సిమెంటు - ఇసుక – గులకల్ని ఆ 15 గజాల మేర వదిలించిన ముగ్గుర్నలుగురి గూళ్లనొప్పిని ఎలా కొలవగలం ?
నడుములు నొప్పిపెట్టినా, మోకాళ్లు ఇక చాలు అంటున్నా కాలుష్యాల మీద కలబడి, 6.30 కు ఆ పూటకు తాము మెరుగుపరచిన గ్రామ వీధిని చూసుకొని, మురిసిపోయే అల్ప సంతుష్టులకు ఏమిస్తే ఋణం తీరుతుంది?
ఈ వేకువ పనులు సాఫీగా జరిగిపోతున్నప్పుడు కాస్త ఇబ్బందేమంటే ½ గంట పాటు కరెంటు పోవడం! రెండుమార్లు విజిల్ ఊదినా 10 మంది పని విరమించకపోవడం!
నేటి ఇంకో ఆసక్తికర – ఆశ్చర్యకర ఉదంతం:
సంవత్సరం నాడు వెలివోలులో స్వర్గస్తురాలైన కోనేరు జయప్రద గారి కొద్దిపాటి ఆస్తిని ఆమె కోరిక మేరకు – వారి బంధువు ఘంటా వేంకట రామయ్య గారు పేదలకు, ఆశ్రమ వృద్ధులకు అన్నదానం గానూ, స్వచ్ఛ చల్లపల్లికి 10,120/- విరాళం గానూ సద్వినియోగించడం!
1) ల్యాబ్ రవీంద్రుని నినాదాలతోనూ,
2) రేపటి వేకువ మన శ్రమస్థలం మునసబు వీధి నుండి అనే నిర్ణయం తోనూ 3270 వ శ్రమదానం సమాప్తం!
పని చలువతొ విచ్చుచున్న ఈ కలువ
ఇప్పుడిప్పుడె తెలుస్తోంది ఈ శ్రమజీవుల విలువ
శ్రమదాతల పని చలువతొ విచ్చుచున్న ఈ కలువ
కసికందక – వసివాడక కాంతులు విరజిమ్మాలని
క్రమిస్తున్న స్వచ్ఛ కార్యకర్తల కభివందనాలు!
-నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
23.10.2024