3272* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

ఈ 3272*వ శ్రమ సందడిని చిత్తగించండి!

          అది ఆశ్వయుజ శుక్రవారం నాటిది, నేను 4-12కు బందరు బాటలోకి వెళితే – ట్విల్స్ వస్త్ర దుకాణం దగ్గర అప్పటికే కాచుక్కూర్చున్న డజను మంది శ్రమవీరుల సంగతది! అక్కడ మొదలుకొని 6-10 దాక - ప్రధానంగా 100 గజాల మచిలీపట్నం మార్గంలోనూ, 20 గజాల మునసబు వీధిలోనూ వీధి కాలుష్యాలను ఖతం చేసినది!

          35 మంది అసలు కార్యకర్తలూ, ఐదుగురు ట్రస్టు కార్మికులూ కాక – ఆరేడుగురు పంచాయతీ కార్మిక సోదరులు చివరి అరగంటలో చేరితే – బజారులో ఇంకా వ్యర్థాలు మిగులుతాయా? 47 గురు ఒకచోట చేరి, గ్రామ సంక్షేమం కోసం పాటుపడినప్పటి శ్రమజీవన సౌందర్యం ఎలా ఉంటుందో ఊహించండి!

          గంటా 50 నిముషాలు శ్రమించాక కూడ – పని విరమణ విజిలు మ్రోగినా సరే – మునసబు వీధిలో నలుగురు మురుగుకాల్వను బాగు చేసే – భద్రపరిచే పని మానరాయె!

          ట్రాన్స్ఫార్మరు ఫెన్సింగులో దూరిన ఒక రైతు ముఖ్యుడూ, మరొక రోటరీ ప్రముఖుడూ గడ్డి పరకల్నీ, కొబ్బరిబొండాల వ్యర్థాలనీ, ఖాళీ సారా / శీతల పానీయ సీసాల్నీ ఐదారు డిప్పలు బైటకు లాగారు! అక్కడికి తూర్పు – పడమర జాగాలను 15 మంది ఎంత శ్రమిస్తే ఇప్పుడింత చక్కగా కనిపిస్తున్నది?

          దివంగత సారధి గారి ఇంటి పరిసరంలో గాని, జమీందారుల ‘వైజయంతం’ ప్రక్కన గాని డజను మంది పూనుకొంటేనే గదా – ట్రాక్టరు సగానికి మట్టి దొరికినదీ, అది మరొక రోడ్డు మార్జిన్ పూడికకు పనికొచ్చిందీ!

          మన ఊళ్లో ఇంతమంది దిన తొలిచర్య తలా గంటన్నరో – గంటో – తమ ఊరి మంచికోసం శ్రమదానమనుకోవడం చల్లపల్లికి గర్వకారణమూ, సమాజానికొక మార్గదర్శకమూ కదా?

అన్నట్లు – ఈపూట 40 మంది శ్రమదాతల్లో ఒక క్రొత్త కుర్ర కార్యకర్త – పద్మావతి ఆస్పత్రిలో కొంగ్రొత్త కాంపౌండరు – హేమంత్!

          ఈనాటి స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాల సంగతి విశ్రాంతోపాధ్యాయిని - రాయపాటి రమగారూ, ప్రవచనాలు అడపా వారూ చూసుకొనిరి!

          రేపటి వేకువ కూడ మనం కలుసుకొనే చోటు భగత్ సింగ్ గారి దంత వైద్యశాల వద్దే!

          క్రొత్త మనుషులు వచ్చి చూస్తే

మాటలేమో ఒదిగిపోవును – మంచి భావన లంకురించును

త్యాగ చింతన బయలుదేరును – స్వార్థములు వెనకడుగు వేయును

క్రొత్త క్రొత్తగ కానిపించును క్రొత్త మనుషులు వచ్చి చూస్తే

కార్యకర్తల తోటి చేతులు కలుపవలెనను తలపు కలుగును!

-నల్లూరి రామారావు

  ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  25.10.2024