పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3273* వ శ్రమ సౌందర్యం తెలుసుకొందాం!
ఆశ్వీజమాస – స్థిరవాసర - బ్రహ్మముహుర్త సమయే – తక్రపురి గ్రామ - బందరు మార్గే - భగత్ సింగ్ దంత వైద్యశాల సమీపే - హుణకాలమాన ప్రకార 4.20-6.10 మధ్యస్తకాలః!
ఇటీవల రోజుల్లో రికార్డు స్థాయిలో - అసలుసిసలు కార్యకర్తలు ముప్పై నలుగురూ, అతిథి – అభ్యాగత – పంచాయతీల పనివారితో కలిపి 52 గురూ,
ఇటు మునసబు వీధి మొదలు తూర్పు రామాలయ పర్యంతం చీపుళ్ల ధాటికి వీధి దుమ్ములేస్తూపుతూ, వీధి దక్షిణ దిక్కున గడ్డికోస్తూ, ఉత్తర దిశలో పేరుకుపోయిన ఇసుక + మట్టి మిశ్రాన్ని చెక్కుడు పారల్తో లేపుతూ, ఒకరిద్దరు వైజయంత ప్రహరీ పైకెక్కి హద్దు మీరిన చెట్ల కొమ్మల్ని సుందరీకరిస్తూ....... ఎవరి ఉత్సాహం వారిదీ - ఎవరి సంతృప్తి వారిదీ!
ఈ ప్రధాన శ్రమజీవన స్రవంతికి దూరంగా - మునసబు వీధిలో ఇద్దరు విశ్రాంత వయోవృద్ధుల పరిశుభ్రతా ప్రయత్నాలు! కాస్తంత ఆలస్యంగా వచ్చిన వారేమో – నర్సరీ, రిలయన్స్ స్మార్ట్, క్రొత్తగా వెలిసిన ‘నవోదయ వైన్స్’ వంటి చోట్ల పనులకు పూనుకొన్నారు!
అవనిగడ్డ నుండి వచ్చిన ఒక యువకుడు చాల సేపు ఈ శ్రమదాన తతంగాన్ని అయోమయంగా చూసి, ప్రక్కవారినడిగి వివరాలు తెలిసుకొంటున్నాడు. ఈ 40-50 మందీ అతనికేదో ‘తేడాగాళ్లు’ అనిపించీ ఉండొచ్చు!
గత 3/4 రోజుల నుండీ కార్యకర్తల-సందర్శకుల సంఖ్య పెరుగుతూపోతున్న వైనమేనని ఆరా తీస్తే –
I మన ఊరి స్వచ్చ-సుందర-శ్రమదానం ఒక నిర్ణయాత్మక దశకు చేరుతున్నదనీ,
II అందుకొక కారణం మన వైద్య దంపతుల పట్ల సానుభూతీ (అంటే-వారు ఊళ్లో లేనపుడు కుంటుపడకుండా ఈ గ్రామ బాధ్యతలు జరిగి పోవాలని),
III కార్యకర్తల ఈ వ్యసనం ఊళ్ళో ఇంకొందరు మహిళలకు నచ్చి, వాళ్లు కూడ అంటించుకొనే ఆలోచన చేస్తున్నారనీ తెలిసింది!
[ఇది దృష్టిలో పెట్టుకొనే కాబోలు - ఒకాయన చివరి మీటింగులో.. “ఈ DRK ఇంకొన్నాళ్లు రాకుంటేనే మంచిది” అని కామెంట్ చేశాడు కూడ!)
ఏమైతేనేం-శనివారపు వేకువ శ్రమ ఉత్సాహంతోనూ, 100 గజాల మేర సువిశాల రహదారి చూడముచ్చటగానూ-
మాజీ వార్డు మెంబరు పసుపులేటి ధనలక్ష్మీ ప్రకటిత స్వచ్చ-సుందర-నినాదాలతోనూ, అడపా వాని సూక్తిముక్తాలతోనూ-
రేపటి రేపు ‘రిలయన్స్ స్మార్ట్ ప్రాంగణమే మన కలయిక చోటు’ అనే నిర్ణయంతోనూ ముగిసింది!
దేశానికి దీపికగా
ఊరంతటి గర్వంగా-రాష్ట్రానికి పండుగగా
దేశానికి దీపికగా-దిక్సూచిగ జరుగదగిన
స్వచ్చోద్యమ చల్లపల్లి దశాబ్ది వేడుక కోసం
గ్రామ సహోదరులెల్లరు కలసి రండు-కదలి రండు!
- నల్లూరి రామారావు
26.10.2024