పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3280* వ శ్రమసందడిని ఆ సాంతం వీక్షిస్తే –
......గాని, ఈ 2-11-24 - శుక్రవారపు వేకువ 41 మంది పని ఉరవడి గమనించిన వాళ్లకు గాని – స్వచ్ఛ కార్యకర్తల పారిశుద్ధ్య పనులకు అందమైన ‘శ్రమదానోద్యమం’ వంటి పేరెందుకు వచ్చిందో తెలియదు.
చేసేదేమో - ఎంగిలాకుల, మురుగుగుంటల, టిఫిన్ చిత్తు కాగితాల దీన - హీన చర్యలూ, ‘స్వచ్ఛ సుందరీకరణోద్యమం’ లాంటి మంచి పేర్లు వాటికి!
అసలు కిటుకు తెలియని చాల మంది బైటవాళ్లేమనుకొంటున్నారు - ఈ కార్యకర్తల గురించి?
“అబ్బో! పది సంవత్సరాల నుండీ - ఎండనక, వాననక, చీకటితో వచ్చి ఊరి కోసం పనిచేస్తున్న త్యాగమూర్తులూ గట్రా” అని ! మరి అసలు వాస్తవమేమంటే - ఇందులో మూడొంతుల మంది ఈ వ్యసనాన్ని వదిలించుకోలేక - ఒంట్లో ఓపిక తగ్గుతున్నా, సొంత పనులున్నా వాయిదా వేసుకొని వచ్చే వాళ్లే! మానడం వాళ్ల చేతుల్లో లేదు – వ్యసనం చేతుల్లో ఉంది!
లేకపోతే – ‘శంకర శాస్త్రి అనబడే విజయవాడ వాస్తవ్యుడికి - 77 ఏళ్లు వచ్చి, ఈపనులెందుకు చెప్పండి!
50 - 100 కోట్లు కూడ బెట్టుకోవలసిన ఇద్దరు డాక్టర్లకీ వ్యసనమొందుకు ఇంట్లో హాయిగా పడుకోక - ఇందరు పెద్దలకూ, ఇంటి పనులు ప్రక్కన పెట్టి గ్రంథాలయం వీధినే తమ సొంత పెరడుగా శుభ్రపరచే గృహిణులకూ, పొరుగూళ్ల నుంచి కూడ వచ్చి, టిఫిన్ బళ్ల, పూల కొట్ల, దుకాణాల ముందు బాగుచేసే ఇంకొందరికీ, ఈ తిప్పలు వచ్చేవా?
ఒకామె పాతికేళ్ళుగా నర్సుగా శ్రమిస్తూనూ, వాళ్లాయన రెవెన్యూ ఉద్యోగిగానూ కష్టపడి సంపాదించిన 5,000/- ను ఈ స్వచ్ఛ సుందరోద్యమానికి ఎదురీయడమెందుకూ? R.I. గా పదోన్నతీ, మనుమడి జన్మదినమూ కలిసొస్తే - ఇలా ఊరి మురికి పని ఖర్చులకే చందా ఇవ్వాలా?
అసలీ దిక్కుమాలిన బజారు పనులు నచ్చకనే గదా - ఊళ్లో సగం మంది ఇటు తొంగి చూడంది?
ఏదో లెండి - ఈ అమాయక కార్యకర్తలు వీధులూడ్చినా, కెనారా బ్యాంకు ప్రాంతం గుంటను కష్టపడి పూడ్చినా, వదిలేద్దాం!
అదుగో - 6.25 కు వాళ్లు ఈ పూట తాము సాధించిన దానికి DRK తో సహా సంతృప్తి చెంది, తూము వెంకటేశ్వరుడి నినాదాలు పునరుద్ఘాటించి, గురవయ్య నీతి వాక్యాలు పట్టించుకొని,
రేపటి వేకువ 3 రోడ్ల కూడలి – కూల్ డ్రింకు కొట్ల వద్ద కలవాలని నిర్ణయించుకొని - 6.40 కి ఇళ్లకు బయల్దేరారు!
తాత్సారం అవసరమా?
రాజు కొరకు ప్రాణాలను వ్రాసిచ్చిన ఆవేశమ -
ఊరి కొరకు ఒక్క గంట పాటుబడే ఆదర్శమ
ఏది మెరుగు - ఏది తరుగు? ఇంగితమన్నది మేల్కొని
తరచి చూస్తె బోధ పడద? తాత్సారం అవసరమా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త
02.11.2024