పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3 అంగల దగ్గరగా దశమ వార్షికోత్సవం! @ 3284*
ఆ నాటిది శనివారం – నేటిది బుధవారం-6.11-24! ఈ వేకువ కూడ-నాలుగుంబావు అయిందో లేదో-బందరు వీధి వైజయంతం దగ్గర నలుగురూ, ఊరికటు చివర-పాగోలు సరిహద్దు కడ డజనుకు పైగానూ శ్రమించడానికి రెడీ అయ్యారు! 6.00 వేళ లెక్కిస్తే-40+7 మందని తేలారు! ఆ టయానికి తోట నాగేశ్వర్రావనే RTC డ్రైవరు Hyd. నుండి వచ్చారు.
ఇందరు కార్యకర్తలు 2 గంటలపాటు ఏం సాధించారు అంటే : అసలు వీళ్లు 3 ½ కే మేల్కొని, ఈ పూటకేం పనిముట్లు కావాలో సర్దుకొని 2-3-4 కిలోమీటర్ల ప్రయాణాలు చేసి వచ్చిందేమీ ఆ రెండు చోట్ల గోళ్లు గిల్లుకొనేందుక్కాదుగా!
ఊరికీవైపున కుడ్యాలంకరణం చేసి, అందమైన బొమ్మలు చిత్రించి, అటు చివర ఏ పుణ్యాత్ములో మురుక్కాల్వ వంతెనకు 2 వేపులా వేసిన అంకఛండాలపు డంపింగ్ పని పట్టడానికీ-ఆ విధంగా “స్వచ్ఛ-శుభ్ర-సుందర చల్లపల్లి” అంటే ఉళ్ళోకి వచ్చే ఎవరికైనా చప్పున చెప్పకుండానే అర్థం కావడానికే గదా! అందుకని-
సుందరీకర్తల ముఠా ఇటు బందరు రోడ్డు వైపు గోడ మీదా, అటు సజ్జా వారి వీధి గోడ మీదా చిత్ర కళా ప్రావీణ్యత ప్రదర్శించగా...
30 మంది నిన్నటి తరువాయిగా అవనిగడ్డ బాట వద్ద-
1) 18 వ వార్డుకు చెందిన వీధి భాగాన్ని శుభ్రపరిస్తే-
2) మురుగుకంపుకు వెరవని 2 డజన్ల మంది 2 డంపుల్ని ఖాళీ చేసి టాయిలెట్ల దక్షిణపు జాగాలో మళ్లీ క్రొత్తగా కొన్ని పూల మొక్కలు నాటుతున్నారు.
3) 3 గ్గురు వీధి ప్రక్క బాగా పెరిగిన కొమ్మల్ని ఖండించి, ట్రాక్టర్ లోకి ఎక్కించారు.
ఇందరి చేతులు శ్రమించాక ఆ 100 × 40 గజాల ప్రదేశం ఎవరికైనా చూడముచ్చటగా ఉండదా?
ఉద్యమ ఖర్చులకీపూట చందాలందలేదనుకున్నాను గాని లయన్స్ క్లబ్ సభ్యులు బాషా గారు ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమం అభివృద్ధి కోసం ‘మనకోసం మనం’ ట్రస్టుకు 10,000/- విరాళాన్ని చెక్కు రూపంలో అందజేసారు.
9 వ తేదీ-శనివారం ఉదయపు ఫంక్షన్ వివరాలు DRK గారి నుండి తెలిసినవి-
“ఆ రోజున 4.20 కే NH216-గంగులవారిపాలెంక్ x రోడ్డు వద్ద కలిసి, వాహనాల మీద 2 ½ కిలోమీటర్లు ఊరేగి, శివాలయం మీదుగా స్వగృహ ఫుడ్ వద్దకు చేరాలని.”
ఈ ఉదయం కూడా నందేటి వారి గాన రక్తి కట్టింది!
రేపటి వేకువ మనం దండెత్తేది RTC బస్ స్టాండు కాలుష్యాల మీదనట!
ఇందరి ఎదలోతులలో?
ఎప్పుడైన విన్నారా ఈ దశాబ్ద శ్రమ చరిత్ర!
ఎవ్వరైనా చేశారా ఇంత మురికి వెగటు పనులు!
ఏ చిక్కని తాత్త్వికతలు ఈ శ్రమజీవుల మదిలో?
ఏ ప్రగాఢ అనుభూతులు ఇందరి ఎదలోతులలో?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త
06.11.2024