3286* వ రోజు ....

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

దీని నామమేమి తిరుమలేశ! @3286*

          శుక్రవారం నాటి (8-11-24) వేకువ కారకర్తల కృషి ఉరవడీ - పరవడీ చూస్తుంటే వచ్చిన సందేహం ఇది – గంగులవారిపాలెంరోడ్డు - NH 216 కూడలి వద్ద 6.25 కు గుమికూడిన 56 మంది వాలకమూ, 2 చోట్ల గత తమ పనులకి తామే ఈ పూట మెరుగులు పెట్టిన 47 మంది కదలికలూ చూస్తుంటే ఎవరికైనా –

1)  ఇది శ్రమదానమైతే - 6.00 దాటినా విరమించరెందుకు!

2) చేసేది బండ – మొండి - మురుగు కంపు పనులైతే – ఆ ముఖాల్లో అంతటి ఉత్సాహమెందుకు?

3) ఈ శ్రమదానంలో పాల్గొనటానికి - U.S.A. నుండి వచ్చి మరీ ఒకాయన నినాదాలతోనూ, మెచ్చుకోలుతోనూ కార్యకర్తల్ని ఉత్సాహపరచాలా?

4) మగవారు సరే - 20 మంది మహిళలు సైతం ఊరికి దూరంగా వచ్చి శ్రమించాలా?

5) చిత్తు కాగితాలేరే వ్యాపారులూ, బరువు పనులకు కూడ సై అనే వయసు మళ్లిన కార్యకర్తలూ ఈ చల్లపల్లిలో మాత్రమే ఉంటారెందుకు?

6) ఏ శుభకార్యం కోసమో అన్నట్లు ఇందరి ఉత్సాహం, ఉద్వేగం ఏమిటి?
          అసలిది శ్రమదానమా - గ్రామ కల్యాణమా
? వీళ్లు చౌచౌకార్యకర్తలా - మనసులూ, తనువులూ శతశాతం కేంద్రీకరించి పాటుబడే శ్రమదూతలా?

          ఈ రహదారి వద్ద ఇన్ని ఖర్చులతో – వల్లమాలిన శ్రమలతో ఈ నామఫలకాలేమిటీ - అందంగా కట్టడాలేమిటీ? తారు రోడ్ల సుందరీకరణలేమిటీ – కలుపు తీతలెందుకూ?

          సినిమాలకు శతదినోత్సవాల్లాగా – పదేళ్ళ శ్రమదాన వార్షికోత్సవాలేలా? అందుకెక్కడెక్కడి నుంచో అతిథులేల?

          ఇన్నిన్ని వింతలూ - వేషాలూ చూస్తుంటే ఇదేదో తేడా ఊరనిపిస్తుంది గదా! ఈ 50 మందీ అందర్లా అనిపించడం లేదు కదా?

          నేటి కార్యకర్తల కష్టాన్నీ - కష్టంలోనే వాళ్ళ సంతోషాన్ని సమీక్షిస్తూ - ఆనందంతో మాటలు పెగలని ఒక స్వచ్చ వైద్యుడూ, సందు దొరికితే మైకందుకొని పాటో - పద్యమో ఎత్తుకొనే ఒక స్వచ్చోద్యమ ఆస్ధాన గాయకుడూ –

          చివరికి - ఎన్నాళ్ళో వేచిన నవంబరు 9 ఉదయం శ్రమదాన విజయోత్సవ కార్యక్రమం - అంటే రేపు 4.00 కే మనం NH216 వ రహదారి దగ్గరకు వచ్చి, గస్తీ గది నుండి కిలోమీటరు పాదయాత్ర చేసి - స్వగృహ ఫుడ్స్ వద్ద సభలో పాల్గొనాలనే సమాచారంతో 6.50 కి ఇళ్లకు బయలుదేరారు!

          అడుగులకు మడుగులొత్తుడు!

ఎవరి కుందొ సమైక్య భావన - ఎవరికున్నదొ ప్రగతి శీలత

ఎవరి వలనో హరిత సంపద - ఎవరి వలన సమాజ భద్రత

ఎవరు గ్రామ హితాభిలాషులు - శ్రమ త్యాగ పునీతులెవ్వరు –

వారి సంస్కృతి నాదరింపుడు - వారి అడుగుల మడుగులొత్తుడు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త

   08.11.2024