పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
స్వచ్ఛ – సుందరోద్యమానికి శిఖరాయమానంగా – 3287* వ రోజు!
ఈ శనివారం (9-11-24) ఉషోదయ కార్యక్రమం సమాజం పట్ల ఏకాస్తయినా బాధ్యతున్న వాళ్లకీ, మంచి జీవన గమనాన్ని కోరుకొనే వాళ్ళకి బహుశా, చాలకాలందాక ఒక మధుర స్మృతిగా, ఆశాజ్యోతిగా, సదాచరణ ప్రేరకంగా ఉండవచ్చు!
నేటి స్ఫూర్తిదాయక పాదయాత్రలో పాల్లోనే అదృష్టం దక్కని గ్రామస్తులకు 2 కి.మీ. ఊరేగింపులోని కొందరు తమ ఇరుగుపొరుగులకూ బంధు మిత్రులకూ కథలుగా - గాథలుగా వినిపించ వచ్చు!
ఆ యాత్రకు వన్నె తెచ్చిందెవరని? వందల కిలోమీటర్ల హైదరాబాదు నుండి వచ్చి – కారెక్కక - నడిచిన 77 ఏళ్ల కోడూరు వరప్రసాదరెడ్డీ, 67 ఏళ్ళ గురవారెడ్డీ, పాతిక వేల కి.మీ. దూరం నుండి వచ్చిన మారధాన్ వీరుడు సురేష్ నాదెళ్ల, ఒక విలక్షణ గాంధేయ రాజకీయుడు MLA బుద్ధ ప్రసాదూ!
నా వరకు నేను ఇలాంటి పాదయాత్రనూ, 2 ½ గంటల సమావేశాన్ని జీవితంలో చూసి ఎరగను! అరె! ‘నెమ్మదిగా వీధిలో నడవండి నాయనా!’ అంటే ఊరేగింపు అగ్ర భాగాన కొందరు ఆనంద తాండవ మాడితిరి! చిట్టూర్పూ, ఘంటశాల శ్రీనులిద్దరూ పాటలు పాడండయ్యా అంటే ఆవేశంతో పాడి, 150 మంది హృదయాల్ని నాట్యమాడించేస్తిరి! 3 రోడ్ల సెంటర్లో డప్పు వీరుల విన్యాసాలు చూసి తీరవలసిందే!
ఇక స్వగృహ సభా మందిరంలో 260 మంది అనుభూతులేవో వాళ్ల ముఖ కవళికలలో కొంత వరకు పసికట్టాను! మండలి బుద్ధప్రసాదు గారి, శాంతా బయోటెక్ వ్యవస్థాపకుని ప్రసంగాలు జాగ్రత్తగా వినిన వారెంత తన్మయులయ్యారో – ప్రేరణ పొందారో!
“సార్! మీరు ఇంతవరకు చేసిన ప్రసంగంలో కొన్ని అంశాలను కొద్దిగా ఎడిట్ చేసి 10 వ తరగతి పిల్లల పాఠ్యాంశంగా బాగుంటుంది” అని MLA గారితో చెప్పాను కూడా!
నేటి ఇద్దరు వక్తలు – బుద్ధప్రసాద్, వరప్రసాద్ గార్ల ప్రసంగాలతో స్ఫూర్తిపొందారేమో గాని అప్పటికప్పుడు ఈ క్రింది విధంగా “మనకోసం మనం” ట్రస్టుకు విరాళాలందాయి.
1. ఘంటా హేమలత – 25,000/-
2. డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య – 25,000/-
3. ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి – 10,000/-
4. డా. దుగ్గిరాల శివప్రసాద్ – 2,00,000/-
5. తుళ్లూరి లక్ష్మీ నరసింహారావు – 10,000/-
6. వడ్డి బ్రహ్మేశ్వరరావు – 5,000/-
7. ఉడత్తు వేంకటేశ్వరరావు – 10,000/-
వీళ్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
అసలామాటకొస్తే - అదొక సభా? సభా సంప్రదాయంగా కుర్చీలా – శాలువలా – దండలా - అద్దెకు తెచ్చుకొన్న చప్పట్లా - హంగూ ఆర్భాటాలా?
ఏమీ లేకుండానే ఒక దశబ్దానికి సరిపడా చప్పుడు లేకుండా ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపిన ‘సభ కాని సభ’ అలా ఫలప్రదంగా ముగిసింది! యాభై లక్షల వాగ్దానం రావడం వేరే సంగతి!
9.30 కు నేనింటికి బయల్దేరేప్పటికింకా ఫంక్షన్ హాల్ లో ఉత్సాహ తరంగాలు తగ్గనేలేదు!
U.S.A. ప్రవాసి - నాదెళ్ల సురేష్ నాయకత్వంలో - బందరు కలక్టరేట్ దాకా – 27 కి.మీ. పరుగు యాత్ర కోసం రేపటి వేకువ గస్తీ గది వద్ద కలుసుకొందాం!
స్వచ్ఛ చల్లపల్లి ప్రశ్నోత్తరీయం?
ఎవరి కొరకు వాళ్లా? కాదు - ఊరి కొరకు ఈ కొందరు!
ఎవరి శ్రమ వాళ్లదేన? No – సమన్వయించుకొంటు ముందుకు!
ఒకటో రెండో రోజులా? లేదు – దశ వసంతాలు!
మరి - ఎందాకా ఈ పయనం? మన ఊరంతా మారు వరకు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త
09.11.2024