3288* వ రోజు....

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

26 కి.మీ. బారునా పరుగుల సందడి!-@3288*

 60+20 మంది 10-11-22- ఆదివారం నాడు వేకువ 4.00 - 10.30 నడుమ - చల్లపల్లి గస్తీ గది నుండి బందరులో RK ఫలాహారశాల దాక రకరకాల విన్యాసాలతో రెచ్చిపోయిన సందడన్నమాట !

          ఇదొకరకంగా చల్లపల్లి శ్రమదానోద్యమకర్తల నిన్నటి దశ వసంతాల వేడుకలకు పొడిగింపు అనుకోవచ్చు! మరి - సదరు పొడిగింపులేవో చల్లపల్లి వీధుల్లో కాక-216 వ రహదారి మీదుగా  మచిలీపట్నం పుర వీధుల్లో ఎందుకందురా? అందుకు 2 కారణాలు:

          మొదటిది – ఏలిన వారైన జిల్లా కలెక్టరు వద్దకు సురేష్ నాదెళ్ల అనే చల్లపల్లికి చెందిన ప్రవాసుడు పరుగుతో చేరుకొని, తన గ్రామాన్ని మరింత పరమ శుభ్ర –సుందర- సౌకర్యంగా చేసుకొనేందుకు  అధికారుల సహకారమర్ధించుటకున్నూ-

           రెండవది - తాతినేని రమణ గారి మనుమడు లోచన్  2 వ, అల్లుడు కొల్లి మోహన క్రిష్ణ 32వ జన్మదిన సందర్భంగా – బందరు దగ్గరి గొల్లపాలెం ప్రక్కన 10 అడుగుల పెద్ద 89 పొగడ, 8 రేలా, 3 స్పెతోడియా చెట్లను 60 మంది ఈ చల్లపల్లి కార్యకర్తలు నాటుటకున్నూ! ఈ మొక్కల+ సంరక్షణ విలువ సుమారు 35 వేలట!)

          ఇక - ఈ ఉదంతం మొత్తంలో కేంద్ర బిందువు నాదెళ్ల  సురేష్ ఐతే- అతనికి సంఘీభావంగా ఆరేడుగురు అప్పుడప్పుడూ పరుగెత్తి- మిగిలిన వారు వీలైనంత నడిచి, పాత్రికేయుల  ఫొటోలతోనూ, కుర్ర కార్యకర్తల ఈలల హుషారు తోనూ- మొత్తమ్మీద ఆ రహదారి 2 ½  గంటలు చల్లపల్లి స్వచ్చోద్యమకారుల అదుపులోకి వెళ్లింది!

    100 మొక్కల్ని నాటాక  - 60 మంది కార్యకర్తలు + 20 మంది బందరు స్వచ్చాభిమానులూ  కోనేరు సెంటరు నుండి 1 కిలో మీటరు పైగా పాదయాత్ర చేసి, ఆ యాత్ర పరమార్థ మేదో బందరు పుర ప్రజలు  గ్రహించి, పత్రికా సమావేశాలు జరిగి, RK హాటల్ లో స్వల్పాహారం స్వీకరించి, చల్లపల్లి బాట పట్టారు!

          ఈనాటి నాలుగున్నర గంటలు స్వచ్చ సుందర కార్యకర్తల వినూత్న ప్రయత్నం వృధా పోదు; వాళ్ళ అంతులేని సహనానికి ఎప్పటికైనా తగిన ఫలితం లభించకమానదు; చల్లపల్లితో బాటు - బందరు పరగణా కాని – రాష్ట్రం గాని స్వచ్ఛ - సౌందర్య- హరిత వైభవాన్ననుభవించక తీరదు!

          మన రేపటి వేకువ రహవారి అలంకరణకోసం 216 వ రహదారి గంగులవారిపాలెం(స్వచ్చ చల్లపల్లి స్వాగత ద్వారం) వద్ద కలుద్దాం!

 

  స్వచ్ఛ సుందర స్వాప్నికులకు శుభాభినందన!

ఊరి మంచికి పరితపిస్తూ- వృక్ష సంపద పెంచుకుంటూ

పుష్పజాతులు వృద్ధిచేస్తూ - నిష్ప్రయోజక కలుపుతీస్తూ

సాటి గామ్రస్తులకు స్వస్తత పాఠములు బోధించుకొంటూ  

సాగిపోయే స్వచ్ఛ సుందర స్వాప్నికులకు శుభాభినందన !

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త

   10.11.2024