3289* వ రోజు ....

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

నేటి శ్రమ పని దినం 3289* వది!

            ఇది సోమవారం - నవంబరు 11 వ రోజు వీధి పని ప్రారంభ - పరిపూర్తి సమయాలు 4:10 & 6:10. తొలి కార్యకర్తలు 10 మందీ, ముగింపు వేళకాసంఖ్య ఆంజనేయుని తోకలా 48 కి పెరిగింది. నవంబరు 11 వ తేదీకి చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం 10 సంవత్సరాలు ముగిసింది! ప్రారంభ దినపు 15 మంది కార్యకర్తలకిది 3 రెట్లన్న మాట!

            ఈ వేకువ కాలపు 2-3 శ్రమదాన విశేషాలు ముచ్చటించుకొందాం: మొదటిది గంగులవారిపాలెం నుండి స్త్రీ బాల - వృద్ధులతో సహా 13 మంది వచ్చి, అబగా వీధి పారిశుద్ధ్యంలో దిగడమూ, వాళ్ళ పని తీరును చూసి నాదెళ్ల సురేష్ ఆశ్చర్యపోవడమూ! [వాళ్లేమీ ఇది వ్రాస్తున్న నాలాగా ఫాన్ల క్రింద, A.C ల మధ్య పనిచేసిన వాళ్లు కాదు - కష్టజీవులు గదా!]

            రెండోది - నిన్న 26 కిలోమీటర్లు పరుగెత్తిన అమెరికా ప్రవాసవీరుడు ఈ వేకువ తన ఇంటికి దూరంగా వచ్చి, పారతో మట్టి పనికి దిగడం! వంద కిలోమీటర్ల పరుగు పరాక్రమవంతుడికిది విశేషం కాకపోవచ్చు గాని, పాతిక వేల కిలోమీటర్ల ప్రయాణమూ, జెట్ లాగూ వంటివి అధిగమించడం మనబోటి వాళ్లకు అబ్బురమే!

            ఇక - కార్యకర్తల పని గురించి చెప్పేదేముంది! తమ ఊరి శ్రేయస్సు కోసం ఈ బ్రహ్మకాలపు శ్రమదానం వాళ్లకెప్పటి నుండో వ్యసనంగా మారిపోయింది. చెత్త బండెక్కి సర్దడమైనా - మురుగు కాల్వ సిల్టు తోడడమైనా చల్లపల్లి సెంటరు ఊడ్వడమైనా ఇదుగో ఈ గంగులవారిపాలెం రోడ్డు సుందరీకరణమైనా వాళ్లకొకటే! ఆ పట్టుదల తగ్గేదీ కాదు - గమ్యం చేరేదాక ఆ శ్రమదానం ఆగేదీ కాదు!

            శనివారం నాటి మన దశ వసంతాల వేడుకను నిర్వహించిన స్వగృహ ఫంక్షన్ హాల్ యజమాని కోనేరు ఆనంద్ గారు అద్దెను మాఫీ చేసి 35 వేల రూపాయల సహాయం చేసినందుకు మనందరి ధన్యవాదాలు!

            గంగులవారిపాలెం వైపు బాట మొదట్లో 6:20 కి జరిగిన సమీక్షా సమావేశం అదే ఊరికి చెందిన రుద్రపాటి శ్రీహరి గబగబా పలికిన నినాదాలతో మొదలై గత 2 రోజుల కార్యక్రమ విశేషాలకు చప్పట్లు మ్రోగి, నిన్నటి యాత్రలో చిరులోపానికి నాబోటివారికి బాధ కలిగి.... 

            రేపటి శ్రమదానోత్సవం కూడ గంగులవారిపాలెం వీధుల్లోనే  జరుగుతుందట!

            వేదఘోష చెవికెక్కక -

ప్రకృతిని పూజించుడనినవేదఘోష చెవికెక్కక -

పర్యావరణపు భద్రత బాధ్యతలను గుర్తించక

ప్రకృతి విధ్వంసాలకు ప్రతిఫలమును చూస్తున్నాం

ప్రకృతి పట్ల గౌరవమే స్వచ్ఛ సుందరోద్యమం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త

   11.11.2024