పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
అసలైన శ్రమ వేడుకను అర్ధం చేసుకొందాం! - @3292*
ఈ గురువారం (14-11-2024 ) వేకువ మరీ 4.14 కే ఓం ప్రథమంగా 14 మంది “అయమ్ ముహూర్తోః సుమూహూర్తః” అని నేటి శ్రమ వేడుకకు తెర తీశారు!
“మేం కూడ తగ్గేదేలే” అని గంగులవారిపాలెం నుండి వెను వెంటనే పాతిక మంది వాళ్లతో కలిశారు! ఎవరెవరు ఆ తర్వాత ఎప్పుడెప్పుడొచ్చి, NH 216 లో వాహనాలు నిలుపుకొని, ఎవరే మూలన పనికి దిగారో గాని – 6 గంటలప్పుడు లెక్కేద్దును గదా పిల్లా - పీచూ, ముసలీ - ముతకా 56 గా తేలారు!
పదేళ్లకు పైబడి – 4 లక్షల పని గంటలపాటు – ఇదొక పిచ్చి పని అనుకొంటే - ఎందుకు వీళ్ళ వెర్రివేషాలు? ఇప్పటికీ గ్రామ స్వచ్ఛ – శుభ్ర - సౌందర్య సాధనకు నడుం కట్టని సగం మందిని మరో దశాబ్దమైనా సరే మార్చగలమా - లేదా అని తేల్చుకొందామనే?
ఇదెంతో మంచి ప్రయోజనకరమైన శ్రమదానమనుకొనే గదా – 18 వ వార్డు వారు తండోపతండాలుగా కదిలి వచ్చింది? కనీసం 3 ఊళ్ల కార్యకర్తలకు ఇదెంత గొప్ప శుభసూచకమో తెలియకుండానే – మరీ అమాయకంగా - ఏ DRK మహాశయుడు రమ్మన్నాడనో మూడేసి, నాలుగేసి కిలోమీటర్లు చీకట్లో వచ్చి కష్టిస్తున్నారా?
మరి ఇక గ్రామంలో అన్ని వార్డుల – ఇంత వరకూ శ్రమదానానికేసి తొంగి చూడని సోదరులకు ముహూర్తమెన్నడు? ప్రతి వేకునా రెండు - మూడు వందల మంది సకల వార్డుల వారు వచ్చి – దీన్నొక శ్రమ ‘దానం’ గా కాక – గ్రామ సామాజిక బాధ్యతగా, ఉషోదయ వ్యాయామ చర్యగా పాటుబడుతుంటే చూసి తరించాలనే ఈ ఊరి స్వచ్ఛ సుందర వైద్య ద్వయం కల ఎప్పటికీ నిజం కానే కాదా?
50 మందికి పైగా సదాశయ కంకణబద్ధులైన ఈ స్వచ్ఛ సుందర జాతీయులు 6: 25 కు అందాలొలకబోస్తున్న గ్రామ సరిక్రొత్త ప్రవేశ ద్వారం వద్ద క్రమశిక్షణతో డేవిడ్ గోల్కొండ అనే యువ పాస్టరు ప్రకటిత శ్రావ్య నినాదాలకు సంస్పందించి,
ఆదివారం NH 216 మీద ముమ్మరంగా పూల మొక్కలు నాటే పని పడినందున - ఈ ఉదయమే అల్పాహారమనబడే అనల్పాహారాన్ని పద్మావతి గారి ప్రాయోజకత్వాన స్వీకరించి,
రేపటితో గంగులవారిపాలెం సుందరీకరణ ముగించాలని నిర్ణయించారు!
అశనిపాతం - దురదృష్టం!
“మీలాగే మేము కూడ శ్రమిస్తాం మా ఊళ్ళ కోసం
ఊరి పేరును నిల్పడానికి ఉద్యమిస్తాం మేముసైతం..”
అనిన 40 ఊళ్ల మిత్రుల ప్రయత్నాలకు గండిపడడం
ఆంధ్రదేశ సమగ్ర వృద్ధికి అశనిపాతం - దురదృష్టం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త
14.11.2024