3293* వ రోజు ....

పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

ముగిసిన గంగులవారిపాలెం వీధి శోభాయమాన ప్రయత్నం! - @3293*

          ఇది కార్తీక పౌర్ణమి గురువాసరం, హూణుల లెక్కలో 15.11.24! దయచేసి, ఈ 1.8 కిలోమీటర్ల వీధి మొత్తాన్ని చల్లపల్లి పౌరులంతా ఇప్పుడు అనుశీలించండి!

          గత నాలుగైదు నాళ్లుగా 50 మందీ, నెలరోజులుగా 30-40 మందీ ఈ బాట అందానికీ, హరిత ప్రగాఢతకీ ఎంతెంత శ్రమించారో తెలుసుకోండి! ఒక ఊరిలోని ఒక్క వీధిని కళాత్మకంగా రూపొందించిన శ్రమయజ్ఞం తీరు తెన్నుల్ని తలచుకోండి!

          పదేళ్ళకు పైగా వందలాది స్వచ్ఛ కార్యకర్తలు 4 లక్షల పని గంటలెవరి కోసం కష్టించారో – దాని ఫలితమేదో లెక్క కట్టండి! “Better late than never” అని షేక్స్పియర్  అన్నట్లు – ఇప్పుడైనా మన ఊరి కోసం తలా గంట కలిసి శ్రమిద్దాం రండి!

ఈ ఒక్కనాటి వీధి శ్రమను గూర్చి తెలుసుకోవాలంటే :  

ఒకానొక నిత్య ‘నిరంజన కార్యకర్త’ దంతెతో గబ్బుకొట్టే చోటులో శ్రమిస్తున్న చిత్రాన్నీ,

2-3 ఏళ్ళ పసివాళ్ళు రోడ్డు ప్రక్కల వేస్టు సీసాల్ని ఏరి డిప్పలో నింపుతున్న చిత్ర విచిత్రాన్నీ,

85 ఏళ్ల వైద్య వృద్ధుడు, 75 ఏళ్ల బాలకోటయ్యా ఏ లాభం కోసం ఇంత చీకట్లో శ్రమిస్తున్నారనే వైనాన్నీ

ఊరికి దక్షిణ పశ్చిమ గలీజు ప్రాంతంలో ఇందరు మహిళలు కూడ డొంక నింతగా శుభ్రపరుస్తున ఉదంతాన్నీ,

అసలింతటి చెత్త-బురద-కంపు పనుల్లో 55 మంది నిమగ్నులయిన వింత చల్లపల్లిలో తప్ప ఎక్కడా కనపడని విశేషాన్నీ,

ఒక ఊపులో – ఒక సామూహిక శక్తితో రోడ్డు ప్రక్కల 200 గజాల పిచ్చి మొక్కలూ, తాడి చెట్లకూ రోజులు మూడిన కోలాహలాన్నీ –

          నా వ్రాతతో కాదు - శాస్త్రీజీ, డాక్టర్ జీ ఫొటోల్లో చూడండి.

          ‘ఆలసించిన ఆశాభంగం’ ఊరంతా 100 శాతం మారక ముందే మిగిలిన పనులకైనా – రేపటి నుండైనా మంచి తరుణం మించకుండా వంతుల వారీగా ప్రజలు పాల్గొనండి!

          స్వచ్చ కార్యకర్తలే ఉద్యమ ఖర్చుల దాతలైన సందర్భం చూడాలంటే పల్నాటి భాస్కర సమేత డొక్కా అన్నపూర్ణ గారు తన కోడలు లావణ్య జన్మదినం సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీకి ఇస్తున్న 1000/- విరాళాన్ని,

          మీకు కిక్కు కావాలంటే – కోడూరు వాని అరుపులు వినవచ్చు. సత్సాంగత్యం కావాలనిపిస్తే - పెద్దలుంటారు! శ్రావ్యమైన సంగీత సాహిత్య ప్రియులైతే - మైకు నుండి చైతన్య ప్రబోధ గీతాలున్నాయి!

          బత్తిని శ్రీనివాస్ - ఉమాదేవి గారలు (హైదరాబాద్) చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని అభిమానిస్తూ నెలనెలా పంపుతున్న 5,000/- చందాను ఈరోజు ఆన్లైన్ లో పంపినందుకు కృతజ్ఞులము.

          ఊరి వాళ్లందర్నీ “ఒక్క నాడైనా - ఒక్క సారైనా - స్వచ్చ కార్యకర్తగా బ్రతుకు నేస్తమా! ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా!” అని బ్రతిమాలే శ్రావ్య కంఠం కూడా విన్పిస్తుంది!

          నేటి దూకుడు నినాదాలు గంగులవారిపాలెం యువకునివి,

          ‘రేపటి మన కలయిక NH216 మీద’ అనే నిర్ణయం సమష్టిది!

         కార్యకర్తల కరస్పర్శతొ

శ్మశానములూ, రోడ్ల దరులూ, ముక్కులదిరే పెంట దిబ్బలు

తొమ్మిదేడుల క్రితం కూడా దుమ్ము నిండిన ఊరి వీధులు

కార్యకర్తల కరస్పర్శతొ పరారైనవి కశ్మలమ్ములు

అదే ఊరిపుడద్భుతంగా అవతరించెను చూసి మురియుడు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త

   15.11.2024