3294* వ రోజు....

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

3294* వ పూట శ్రమదాన విశిష్టతలు!

            శనివారం నాటి సదరు విశిష్టతల్ని పూర్తిగా వివరించాలంటే ఈ ఒక్క పేజీ చాలదు గనుక స్థూలంగానే వ్రాస్తాను. మొదటిది చాల దూరం - అంటే జగ్గయ్యపేట KCP సిమెంటు ఫ్యాక్టరీ నుండి వచ్చి 44 మంది పూర్తి చేసిన గ్రామ సామాజిక బాధ్యత ఆకళింపు చేసుకొని - స్వయంగా పాల్గొని - మెచ్చిన రాఘవేంద్రరావు గారు,

            2 వది స్వచ్ఛ – శుభ్ర - సుందరోద్యమాల పూజారి గౌతమ్.. గారు, జగమెరిగిన- అడుగడుగున చల్లపల్లి శ్రమదానోద్యమంలో వ్రేలు పెట్టే ఈ శుభ్ర- స్వచ్ఛోదమ కారుని గురించి చెప్పేదేమున్నది గాని - వీరు చేసిన సూచనలు - దోమల మీద సమర సన్నాహమూ,  చల్లపల్లి శ్రమదానంలో యువ రక్తం లేని లోటూ గుర్తుంచుకోదగినవి!  

            ఇక తృతీయ విశిష్టత మనం ఎప్పుడూ చూస్తున్నదే :

- వివిధ గ్రామాల నుండీ, చల్లపల్లి మూల మూలన్నుండీ ఏ 3 ½ కో లేచి, 3-4 కిలోమీటర్ల దూరంలోని NH 216- కల్యాణ మండపం వద్దకు చేరుకొన్న 40 మంది!

            వీరిలో ఇంటి బాధ్యతలు మోసే గృహిణులూ, రైతులూ, వ్యాపారులూ, ఉద్యోగులూ, సరే – వీళ్లు  శ్రమదాతలు, గంగులవారిపాలెం నుండి 10 మంది పగలంతా కష్టించి జీవించవలసిన శ్రమజీవులు!

            వీరంతా లోతైన రహదారి ఉత్తర మార్జిన్లో దిగి, మంచులో కనీ - కనపడని చోట గునపాలతో కొందరూ, కత్తులతో - దంతెలతో కొందరూ, చీపుళ్లతో మిగిలిన వారూ - త్వరలో నాటబోతున్న మరిన్ని చెట్లకూ, పూల మొక్కలకూ గోతులు త్రవ్వి, గడ్డిని నరికి, ప్రోగులు చేసి, రహదారిని ఊడ్చేశారు!

            వీరిలో ఇద్దరు తమ పెరటి జాంపళ్లను కార్యకర్తలకు పంచి సంతోషించారు.

            స్వచ్ఛ- సుందరోద్యమ నినాదాలతోనూ, చల్లపల్లి సందర్శకులకు స్వాగత గీతంతోనూ నందేటి పాటల వీరుడు అందర్నీ అలరించాడు.

            తూర్పు లంకపల్లి లో రేపటి ఆశ్రమ ప్రారంభోత్సవానికి అక్కడి  బాధ్యులొకరు ఆహ్వానోపన్యాసం చేశారు!

            DRK గారి సమీక్షా సమయంలో (నేటి ఒకానొక సంఘటన దృష్ట్యా) శ్రమదాన వేళను ఈ చలీ మంచూ కాలంలో నైనా 5.00 - 6.30 గా మార్చాలని డాక్టరమ్మ గారి సూచన!

            రేపటి శ్రమదానం కూడ యధాతథంగా NH 216 మీదనే వంతెన దగ్గరే ప్రారంభమౌతుంది!

          లక్షకాదు-కోట్లిచ్చిన

లక్షకాదు-కోట్లిచ్చిన లక్షణమగు చల్లపల్లి

స్వచ్ఛ కార్యకర్తల వలె సమర్థులగు-అంకితులగు

పని మంతులు దొరికెదరా పట్టి పట్టి శోధించిన?

అది ఊరికి అదృష్టమో ! అద్భుత ఆదర్శమో !!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   16.11.2024