పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3295* వ శ్రమ వేడుకను ఆస్వాదిద్దాం!
17-11-24 వేకువ సమయంలో కూడా 216 వ రహదారి మీది అర్థ నిర్మిత కల్యాణ మండపం వద్దనే తమ వాహనాలను నిలుపుకొన్న కార్యకర్తలు అక్కడికి కిలోమీటరు దూరందాక రకరకాల శ్రమదానం చేశారు.
వాళ్ల సంఖ్యాబలమెంతనుకొన్నారు? - 41! ఇక వాళ్ల సంకల్ప బలమైతే నాకొలతల కందనిది.
11 వ ఏడు కూడ-3295* వ నాడు కూడ - మూడేసి నాలుగేసి కిలో మీటర్ల దూరం నుండి కూడ- అదీ మంచు కురిసే వేకువ వేళ 4.30 కు ముందే వచ్చారంటేనూ, తలా గంటన్నర పాటు ఊరి కోసం శ్రమించారంటేనే తెలియడంలా ఈ ప్రత్యేక వ్యక్తుల పట్టుదలేమిటో- ఎక్కడిదాక వెళతారో!
- పోనీ పనులేమైనా - బట్టనలక్కుండా, చెమట పట్టి మేకప్పులు చెదరకుండా, ఫోటోలు, పబ్లిసిటీ కోసం చేసేవీ కాదే! ఎత్తైన రాదారికి 2 గజాల ఉత్తరపు దిగువగా- ముళ్ల, పిచ్చి మొక్కల్ని తొలగించుకొంటూ- త్వరలో నాటబోయే 100 లాది పెద్ద మొక్కలకు కొలతల ప్రకారం గుంటలు తీయడమూ, రాదారి ప్రమాదాల్ని కాచుకొంటూ ఊడ్వడమూ:
ఇక మహిళా మణులేమైనా తక్కువా? 4 గురు ట్రాక్టరెక్కి పెద్ద చెట్లనందించడమూ, కొందరవి నాటడమూ!
ఇందులో ఎవరి శ్రమైనా శ్రమే! అది పక్కాగా నిస్వార్ధమే! అందుకు ప్రతిఫలం ఊరు ఊరంతా స్వచ్ఛ- శుభ్ర-హరిత సౌందర్య విలాస విన్యాసమే! అందుకు ఈ కార్యకర్తలు తమ శక్తియుక్తుల్ని సొంతూరికి ధారాదత్తం చేసేందుకు సిద్ధమే!
విజయవంతంగా నేటి పనులు ముగించిన కార్యకర్తలు చీమల బారంత క్రమంగా భుజాన పని ముట్లేసుకొని,
నేటి-రేపటి బాట సుందరీకరణను చర్చించుకొంటూ వస్తున్న దృశ్యం నాకు చిరస్మరణీయమే!
6.25-6.40 మధ్య జరిగిన సమీక్షా సభను కూడ చూసి తీరవలసిన సన్నివేశమే! దాదాపు 17 లక్షల - 40 నాళ్ళ ఖర్చులూ, అందులో నాల్గు లక్షల లోటూ – ఆ భారం Dr. పద్మావతి గారి భుజాల మీద పడడమూ, యోగా మాస్టరు నినాదాలు, గత స్మృతి నెమరూ....
రేపటి వేకువ మనం చేరుకోవలసింది 216 హైవే లో శివరామపురం రోడ్డు వద్ద ఉన్న బస్ షెల్టర్ వద్ద !
లంకపల్లి గురూజీ నిర్మిత ఆశ్రమ ప్రారంభోత్సవానికీ, ఈ ఉదయం 11.30 కు అన్నప్రసాదానికీ చల్లపల్లి స్వచ్చ సుందర కార్యకర్తలందరూ (ఏకారుప దుస్తులతో) ఆహ్వానితులు!
చల్లపల్లి లోన తప్ప?
ఇంతింత నిబద్ధతతో - ఇన్ని నియమ నిష్టలతో
వీధులన్ని శుభ్రపరచి – వేలాదిగ చెట్లు పెంచి
ప్రతి దినమూ- ప్రతి నిముషం గ్రామం పై శ్రద్ధపెట్టు
శ్రమ జీవిని చూశారా – చల్లపల్లి లోన తప్ప?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
17.11.2024