పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
3300 – 2 (=3298) వ వేకువ శ్రమ స్ఫూర్తి!
బుధవారం (20-11-24) కూడ మళ్లీ అదే NH 216 కు చెందిన – అదే శివరాంపురం రోడ్డు దగ్గర – బస్ షెల్టర్ సమీపాన – 4:10 & 6:10 నడిమి కాలంలోనే (పొందగల్గిన వాళ్ళకి మాత్రమే) సదరు స్ఫూర్తి లభించెను!
నేటి స్ఫూర్తిదాయక శ్రమదాతలు 33 మంది! శ్రమ ప్రదర్శనా స్థలాలు –
1) జాతీయ రహదారి దక్షిణానా,
2) 4 రోడ్ల కూడలిలో – ప్రాగ్దక్షిణాన కళ్లేపల్లి బాటలోనూ!
ఫోటోలో - వీడియోలో చూసి ఎవరైనా గ్రహించవచ్చు - ఈ వేకువ వీధి పారిశుద్ధ్య/ అందగింపుల కార్యక్రమమేమీ తేలికపాటిది కానే కాదనీ, గ్రామ సమాజం పట్ల ఎంతో బాధ్యత లేనిదే జరిగేది కాదనీ!
50/60 అడుగుల వెడల్పైన రహదారికి కాస్త దూరంగా మట్టి దిబ్బలుంటే - ఈ వయసు వ్రాలుతున్న ఐదారుగురికీ, A/C రూముల్లో శస్త్ర చికిత్సలు చేసుకొనే డాక్టర్లకీ, రైతులకీ, గృహిణులకీ ఏమిటిట బాధ? మూణ్ణాల్గు రోజుల్నుండి 3/4 కిలోమీటర్ల దూరం వచ్చి, గంటన్నర పాటు మట్టిని గోకి, త్రవ్వి, డిప్పలకెత్తి మోసి చదును చేస్తే గాని నిద్రపట్టదా?
ప్రధాన రహదారిని శుభ్రపరచాలని వచ్చి, 5 గురు కళ్లేపల్లి వీధి కాలుష్యాల మీద కాలు దువ్వాలా? చేసేవి నూటికి 90 మంది అసహ్యించుకొనే పనులైతే - గంటన్నరకుపైగా వీళ్ల జోకులేమిటో - సంతోషాలేమిటో బోధపడటంలేదు!
పోనీ – “పది - పదకొండేళ్లు పాటుపడ్డారూ – కొంతవరకనుకొన్నది సాధించారూ - ఇప్పుడైనా ఈ పర్యావరణ పరిరక్షణా కార్యక్రమ వ్యసనం మిమ్మల్ని వదలదా?” అని ప్రశ్నిస్తే :
“మన ఊరిని మనం శుభ్రపరుచుకోక - పుష్ప హరిత సంపద సమకూర్చుకోకపోతే - ఎవరు వచ్చి చేయాలి?” అని ప్రశ్నాగర్భిత సమాధానం!
కానీండి – ఏదో ప్రయత్నిస్తున్నారు గదా – వాళ్ళమానాన వాళ్ళని వదిలేద్దాం! గ్రామస్తులం తీరుబడి దొరికినప్పుడే వెళ్లి కార్యకర్తలతో కలుద్దాం!
ఇకపోతే – మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి నవంబరు నెల విరాళం - 2,045 + 55 (దొరికినవి) = 2,100/-
నేటి విస్పష్ట నినాదకర్త తాతినేని రమణ, సమీక్షకుడు ఎప్పట్లాగే DRK వైద్యుడు. “శివరామపురం రోడ్డుకు దక్షిణ పశ్చిమాన రేపు ఉదయం కలుద్దామని నిర్ణయం!
బేహారులెవ్వరు?
MTM రహదారి పొంతను - పెద్దకళ్లేపల్లి జంక్షను
వద్ద ముప్పది మంది నెరపిన పారిశుద్ధ్య ప్రయత్నానికి
మట్టి దిబ్బలు త్రవ్వి చదునుగ మలచినట్టి శ్రమకు విలువను
కట్ట గల బేహారులెవ్వరు? కాలమే బదులీయ జాలును.
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
20.11.2024