3319* వ రోజు ....

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

బైపాన్ వీధి మెరుగుదలలో 30 మంది కార్యకర్తలు - @3319*

          ఇది బుధవారం (11-12-24) వేకువ సమయపు సంగతి. స్థలమైతే 1 వ వార్డుకు చెందిన బాలికల హాస్టల్ ప్రాంతమే. అక్కడ నాలుగుం బావుకే వీధి పనులకు కాచుకుని ఉన్న 11 మందికి మరో 19 మంది తోడై, 6.12 దాక శ్రమించడం వల్ల మరింత అందంగా తయారైన 100 గజాల బైపాస్ బాట!

 

          రైసుమిల్లు బారునా, సజ్జా వారి ఖాళీ స్థలాల పొడవునా అటు ఉత్తరంగా జమ్మి లంకమ్మ ఆలయ పర్యంతమూ, తూర్పుగా బాలికల వసతి గృహం ఎదుటా అలా 2 గంటల నిస్వార్ధ శ్రమ జాలువారుతూనే ఉండెను.

          ముళ్ళున్న అడవి తంగేడు పూల చెట్లు భారీ పరిమాణంలో పెరిగితే - మళ్లీ ఆ కుడి - ఎడమ వాటం ప్రసాదులిద్దరే వాటిని అదుపు చేయబూనుకొన్నారు. ఒకరు కొమ్మలు నరికితే మరొకరు వాటిని లాగి, గుట్టపెట్టడం - ఆ గుట్టను కుమారిల ద్వయం ఈడ్చుకెళ్ళి, ట్రాక్టరు వద్దకు చేర్చడం – మరో ఇద్దరు వాటినందిస్తే ట్రాక్టరు ఎక్కిన కార్యకర్త వాటిని సర్దడం!

          ఏడెనిమిది మంది బాట కిరుప్రక్కలా నేల మీద కూర్చుని, చిన్న గోకుడు పారతో, కత్తితో గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ తొలగించడం చూస్తే ముచ్చటేసింది.

          వసతి గృహం ఎదుట – బాట దక్షిణాన అన్ని ఎండు కొమ్మల గుట్టా, 10 - 12 డిప్పల ఎండు టాకులూ ఎందుకొచ్చాయో తెలియదు – వాటిని ఓపికగా విరిచి, ప్రోగులు చేసి, దూరంగా ఉన్న ట్రక్కులోకి చేర్చిన పని నలుగురిది.

          ఈ పూట 40 మంది కార్యకర్తలు పనిలో దిగుతారనుకొన్నాను గాని - శుభకార్యాల కారణంగా 30 మందే వచ్చారు.

          గాంగ్ టక్, డార్జిలింగ్, సిలిగురి - తదితర పర్యటనల పరిశీలనలు ముగించి, రాత్రి ప్రొద్దుపోయి ఇంటికి చేరుకొన్న Dr. DRK గారు తమ యాత్రా విశేషాలను వివరించారు. తాతినేని రమణుల వారు స్వచ్ఛ సుందర నినాదాలు చేశారు.

          ఇరుకు రోడ్ల వద్ద మార్జిన్ల ఆక్రమణల గురించి కొంత చర్చ జరిగింది. 13 వ డిసెంబరు సచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారి రాక కూడ ప్రస్తావనకొచ్చింది.

          రేపటి మన బందరు వీధి శుభ్రత కోసం గస్తీ గది వద్ద కలవాలని నిర్ణయమయింది!

          ఏమ్మాయలు చేసితివే!

ఈ వృద్ధులకీ ఓపిక ఎచటి నుండి ఊడి పడేనొ!

గృహిణులకీ పారిశుద్ధ్య కృషి ఎందుకు వ్యసనమాయె?

శ్రమ సాహస విన్యాసం కార్యకర్తకెట్లబ్బెనొ!

ఏమ్మాయలు చేసితివే! స్వచ్ఛ సుందరోద్యమమా!!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   11.12.2024