సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!
బందరు రహదారిలోనే మరొక 200 గజాల శుభ్ర- సుందరీకరణం! @3322*
శనివారం వేకువ 4.19 కి డజను మందీ, క్రమక్రమంగా 2 డజన్ల కార్యకర్తలూ కలిసి, సాధించిన వీధి చక్కట్లు మరపురానివి! 6.20 దాక ఇంకా చెప్పాలంటే 6 గురి సుందరీకరణ 7.30 దాక అలా విరామమెరుగక సాగి పోయింది!
రాష్ట్ర మంతటిలో కనీసం ఒక్క గ్రామంలో-36 మంది తమ – గ్రామ ముఖ్య వీధి అందచందాల కోసం బ్రహ్మ కాలంలో శ్రమించడమూ, ఆ వ్యక్తులు బొత్తిగా ఆవారాగాళ్ళేమీ కాదు - ప్రముఖ డాక్టర్లో- గత లేదా ప్రస్తుత ఉద్యోగులో కావడమూ, సొంత వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారు, రైతులు, గృహిణులూ - చేస్తున్నది కూడ అందమైన బట్టల్తో శుభ్రమైన చీపుళ్లు పట్టి ఫొటోలు దిగడం కాక మురుగు - దుమ్ము- చెత్త పనులు కావడమూ, సదరు అమర్యాదకరమైన పనులు చేస్తున్నందుకు కొంచెపడక సంతసించడమూ....
‘ఇదంతా నిజమేనా? గ్రాఫిక్స్ కాదుగదా’? అనిపించడమూ...!
- మొండి గోడ యజమానుల్ని ఒప్పించి, రంగులేసి, నినాదాలు వ్రాసి, బొమ్మలు గీసి, సదరు గోడ నొక శిల్ప సుందరారామంగా మార్చడమేమిటో –
- పింగళి వారి ఆస్పత్రి భవనంపెలుపలి పూల వనంలో గడ్డి పీకి, తుక్కులుంటే ఏరి, కొమ్మల్ని కత్తిరించి, పునఃపునస్సుంరీకరణమెందుకో-
- 1 వ వార్డు ముఖ ద్వారం తూర్పుగా మురుగు కాల్వ అంచున 16 మంది గడ్డి గోకి, నేలను చదునుచేసి, పిచ్చి కంపను తొలగించి, 20 గజాల రోడ్డు మార్జిన్ ను అద్దంలా మార్చేదెందుకో-
10 మంది రహదారినీ చీపుళ్లతో ఊడ్చే సరదా ఏలనో
- కర్మల భవనం ఆవరణను మరీ అంత బాగు చేయ వలసిన అగత్యమేమిటో ---
ఈ గ్రామస్తుల్లో సగం మందైనా ఆలోచిస్తారా?
మునసబు వీధి మొదట్లో అందరూ అర్థ చంద్రాకారంలో నిలిచి, ముందుగా యోగా మాస్టరు నినాదాలు ఎత్తుకోక ముందు -
ఒకాయన కరివే పాకులు పంచితే - తీర్ధ యాత్రలకు వెళ్లొచ్చిన ఇంకొకాయన ప్రసాదం పొట్లాలు పంచేశాడు!
కార్యకర్తల సామూహిక శ్రమకు మురిసిపోయిన DRK వైద్యుడు రేపటి - ఎల్లుండి కార్యక్రమాలు వివరించాడు.
రేపటి వేకువ మనం చక్కదిద్దవలసింది - నాగాయలంక దారిలోని అమరస్తూపం ప్రాంతమట!
ప్రక్క ప్రక్కకు తప్పుకొందురు?
దురాశామయ జీవితములో - నిరాశ మయ పరిస్థితిలో
తమ హితార్థమె ఎవ్వరెవ్వరొ తమ బజారును తుడుస్తుంటే
గడ్డిచెక్కీ- చెమట క్రక్కీ - డిప్పలెత్తీ శ్రమిస్తుంటే
పట్టనట్లే ఎంతకాలము ప్రక్కప్రక్కకు తప్పుకొందురు?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
14.12.2024