సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!
16-12-24నాటి పాతిక మంది శ్రమ విహారం - @3323*
ఆదివారం నాటి శ్రమదాన స్థలం నాగాయలంక బాట నుండి సోమవారానికి ఊరిలోని బందరు రహదారిలోని భగత్ సింగ్ దంత వైద్యశాలకు మారింది.
ఫంక్షన్ల, మీటింగుల తాకిడి వల్లనేమో గాని ఈవేకువ స్వచ్చ కార్యకర్తల సంఖ్య డజనుకు పైగా తగ్గిపోయింది. 4 20 కు ముందుగా 10 మంది, సమయ క్రమాన మిగిలిన 15 మందీ –
1) అమరావతీ రాజ భవనం వద్దా,
2) మునసబు వీధి యందూ,
3) బందరు బాట 150 గజాల బారునా
కొందరు ట్విల్స్ వస్త్ర దుకాణం ఎదురుగా, కొందరు ఉభయ మద్యం షాపుల వైపునా, రిలయన్స్ మాల్ మీదుగా, తూర్పు రామాలయం దాక- దుమ్ము దులిపి, ఇసుకను వీధి అంచులకు నెట్టి, గడ్డి ఉంటే చెక్కి, ప్లాస్టిక్ వ్యర్ధాల్ని సేకరించుకుపోయారు!
ప్రతి కార్యకర్త ఒక చీపురు, ఒక గోకుడు పార, ఒక పదునైన కత్తి తనతో బాటఉంచుకొన్నాడు!
పంచాయతీవారు తోడేసి రోడ్డు మీద వదిలిన కారు నల్లని బురద మట్టి వద్ద చేసిన పనులైనా,
చలి గాలికి దుమ్ము లేస్తుండగా ముక్కుల్లో దూరకుండ జాగ్రత్తగా ఊడ్చిన కృషి గాని—ఏది మాత్రం
మునసబు వీధికి పడమరగాను, మురుగుకాల్వలోను ఏడెనిమిది మంది ఎలా శ్రమించిందీ దగ్గరగా చూశాను!
ఒక బసవ శంకర రావు 10 రోజుల స్వచ్చంద శ్రమకు దూరమైనందున ఎంతగా క్షోభ చెందాడో అడిగి తెలుసుకున్నాను!
రేపటి వేకువ 100 నుండి 150 మంది కార్య కర్తల శ్రమదానం బెజవాడ దారిలోని 6 వ నంబరు కాల్వ వద్ద జరుగునని అందరూ కలిసి నిర్ణయించాము!
ఏ గాంధీ గిరి శ్రమతో
ఏ సాత్విక ఉద్యమాలు ఇంత విజయవంతమయ్యే?
ఏ గాంధీ గిరి శ్రమతో ఇంతగ మారెను గ్రామము?
ఎండా-చలి -మంచుల్లో ఏఉద్యమ మాగలేదు?
ఎంత మాయ జరిగినదో! ఈ దశాబ్ద ఉద్యమాన!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
16.12.2024