3326* వ రోజు ....

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!!

3326* వ శ్రమ వేడుకలో కొన్ని సంగతులు!

          అవి బుధవారం (18-12-24) వేకువ కాలానివి; 4:15 కు మొదలై 6:20 కి గాని ముగియనివి; చలి విపరీతంగా ఉన్నా 31+2+5 గురి ప్రమేయమున్నవి: ఇప్పటిదాక సుమారు 4 లక్షల పని గంటల వీధి సేవల  సంగతులన్నమాట!

          అసలా కార్యకర్తల కొన్ని వేల రోజులు - అన్నిలక్షల పని గంటలు శ్రమించినా అలుపెందుకురాదో - విసుగెందుకు చెందరో కొందరు గ్రామస్తులకు అర్ధం కాదు! గ్రామ స్వచ్ఛ - శుభ్ర - సుందరీకరణం పూర్తయేదాక - గ్రామ చివరి పౌరుడు కూడ ఒక్క కాగితమ్ముక్క వీధిలో కన్పించినా సహించనం దాక - ఈ స్వచ్ఛ కార్యకర్తలనబడే వ్యసనపరులకు - (కొందరి దృష్టిలో "తేడాగాళ్ళకు") ఆ జాడ్యం వదలదంటున్నారు!

          ఈ పూట సంగతే చూడండి! గజగజలాడిస్తున్న శైత్యాన్ని ధిక్కరిస్తూ వేకువ 4:15 కే వీధి శుభ్రతకు తెగబడ్డారా లేదా! పైగా వీళ్ళేమన్నా (అరేడుగురు తప్ప) యువకులూ కాదు! పోనీ చేసేదేమన్నా 'డిగ్నిఫైడ్' పనులా - అబ్బే - చాలమంది చీదరించుకొనే 'అనాగరిక' మురికి పనులు!

          ఇందులో ఆరేడుగురికి 50-60 గజాల గోడ ఒకటి దొరికిందట -  పెయింట్స్ ప్రొఫెషనర్లలాగా ఇంటి దగ్గర్నుండి తెచ్చుకొన్న రంగుల్ని - సరంజామానూ వాడి ఆ గోడ నెంత అందంగా తయారు చేశారో చూసుకొండి!

          15 మంది కార్యకర్తల రెండో టీముకు అమరావతి జమీందార్ల భవనం ఎదుట రోడ్డు మార్జిన్ నచ్చలేదట! గడ్డిచెక్కి, పిచ్చిమొక్కల్ని తొలగించి, వరినారు మడి అనేట్లుగా మార్చేశారు!

          మిగిలిన ఏడెనిమిది మందికీ మునసబు వీధిలో పెద్ద మట్టిదిబ్బ కనపడింది. మనకైతే అదొక పనికిమాలినవేస్ట్ మట్టి! స్వచ్ఛ కార్యకర్తల కలా కాదే - ఆ ట్రాక్టరు మట్టి డంపింగ్ కేంద్రానికి చేర్చి, ఎక్కడ వీధి మార్జిన్ పల్లాలకు వాడాలో - వాళ్లకు తెలుసు!

          కార్యకర్తల + 2 సంఖ్య తెలుగురావుపాలెం వ్యక్తిదీ, కోడూరు నుండి ఆస్పత్రికి వచ్చి, ఆసక్తిగా శ్రమదానంలోకి వచ్చిన వానిదీ!

          కవ్విస్తూ నినాదాలు పలికింది రాయపాటి రాధాకృష్ణుల వారు; సమీక్షించి, ఆనందించినది DRK వైద్యుల వారు.

          రేపటి కార్యక్రమం కూడ భగత్ సింగ్ దంత వైద్యశాల వద్దనే!

     మనసు చల్లగ సేద తీరును!

కర్మవీరులు ధర్మ వీరులు - పరుల బాధ్యత మోయు వారలు

గ్రామ హితముకు నిలుచు ధీరులు - త్రిశుద్ధిగ జీవించు ధన్యులు

కంచు కాగడ పెట్టి వెదకిన కానుపించని త్యాగమూర్తులు

చల్లపల్లిలొ  చూడవచ్చును - మనసు చల్లగ సేద తీరును!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   18.12.2024