సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!!
గురువారం - 3327* వ వేకువ శ్రమ ప్రవాహం!
అది 10-11 ఏళ్లుగా గోదావరి - గంగా జీవనదుల్లాగా ప్రవహిస్తూనే ఉన్నది. ఈ పూట శ్రమకారులు 40 మంది. గ్రామ ప్రయోజనకర శ్రమ ప్రాయోజకులైన వీళ్ళలో వివిధ వయస్సుల - సామాజిక వర్గాల - ఇష్టా ఇష్టాల వ్యక్తులున్నారు గాని - ఇక్కడి 2 గంటల (4.15 to 6.15 AM) శ్రమ సమయంలో మాత్రం అందరి ఆశయమొక్కటే - ఎన్నేళ్లైనా పట్టనీ - ఈ చల్లపల్లిని ఒక స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య ప్రతిమగా తీర్చిదిద్దాలనేదే!
ఇప్పుడొక ఊహా చిత్రాన్ని చూద్దాం - పుష్కరకాలం క్రిందట ఈ గ్రామస్తుడు దేశ దేశాలు తిరిగి మళ్లీ తన గ్రామానికి వచ్చి, నేటి 40 మంది చేస్తున్న శ్రమను చూశాడనుకొందాం. అప్పుడతడు
1) వైజయంతం గోడ బారునా 15 మంది శుభ్రపరుస్తుండడాన్నీ, నలుగురు కుడ్య చిత్రకారుల పనితనాన్ని మెచ్చుకోక తప్పదు!
2) సజ్జా వారి వీధిలో 4 గురు పారల్తో, దంతెతో గడ్డిని చెక్కి ఎగుడు దిగుళ్లను సరిజేసి, మట్టినీ - గడ్డినీ విడిగొట్టే పనిని చూసి, ఆశ్చర్యపోగలడు!
3) బందరు దారి దక్షిణంగా డజను మంది - అందులో గృహిణులు, నర్సులు, వ్యాపారులు, రైతులు, ట్రాన్స్ఫార్మ దగ్గర ఎంతగా శ్రమించి, వీధి అందం మెరుగుపరుస్తున్నదీ చూసి మెచ్చితీరుతాడు.
4) ఇక్కడికి 1 ½ కిలోమీటరు దూరాన - శ్మశానమని చెపితే తప్ప నమ్మని చోట - 10 మంది మెరికల్లాంటి కార్యకర్తలు 2 పొడవాటి విద్యుత్ స్తంభాలు పడి ఉంటే - తరలించి నాగాయలంక రోడ్డులో సర్దడం చూసి ‘ఇంత బరువు పనులా - వీళ్లు చేస్తున్నది’ - అనుకోగలడు!
5) “ఇంత చలిలో ఇందరూ చిన్నా - పెద్దలు ఇళ్ల వద్ద ముసుగుతన్ని నిద్రపోక వీళ్ళకిదేం బుద్ధి? ఈ మురికి పనుల్లో దిగడం?” అని మాత్రం అనుకోడు!
అతడు 6.30 దాక ఉంటే గనుక -
A) రాయపాటి రమ గారు ముమ్మారు చెప్పిన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలకు తప్పక బదులిస్తాడు.
B) రాధాకృష్ణ గారి 70 వ పుట్టినరోజును శ్రమదాతలతో కలిసి జరుపుకోవడాన్నీ, 2500/- చందా ఇవ్వడాన్నీ, చాక్లెట్ బార్లు పంచడాన్నీ వింతగా గమనిస్తాడు!
C) పశు వైద్యులవారి 2000/- నెలవారి చందాను గురించి తెలుసుకోగలడు.
D) 72 మార్లు రక్తదానం చేసిన కస్తూరి విజయుడిని అభినందిస్తాడు.
E) రేపటి వేకువ గంగులవారిపాలెం 11 వ వీధి పండుగకు తప్పక వస్తాడు!
అందరాలోచించదగినవె
“ఎవరి బాధ్యత వారు తీర్చుట, ఇందుకోసం ప్రాకులాడుట
సమాజానికి పడిన అప్పును కొద్దికొద్దిగ తీర్చివేయుట
అందుకై ఒక గంట సమయం శ్రమించడమూ అద్భుతాలా?...”
అనే ప్రశ్నలు వాస్తవములే - అందరాలోచించదగినవె!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
19.12.2024