3330* వ రోజు....

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

3330* వ శ్రమ సమాచార జిజ్ఞాసలకు స్వాగతం!

            ఈ ఆదివారం(22-12-24) స్వచ్ఛ సుందరీకరణ కార్యక్రమం కాస్త ప్రత్యేకత అనే చెప్పాలి. ఆదివారాలనే కాదు - కొన్నిసార్లు కార్యకర్తల శ్రమ విన్యాసాలను వివరించడం నాకు కుదరడం లేదు. అందువల్ల టూకీగా మాత్రమే వ్రాయగలుగుతున్నాను. ఈ వేకువ పనులే తీసుకుంటే:

            47 మంది - 4 చోట్ల ఎవరెలా కష్టించారో, పని సమయంలో వాళ్ళ శ్రద్ధ ఎలాంటిదో, మధ్యలో కొందరి ఛలోక్తులెన్నో, బరువు పనుల్లో ఒకరికొకరెంతగా సహకరించుకొన్నారో, చలి తీవ్రతను లెక్క చేయకుండా వాళ్ళకంత పనిధ్యాస ఎందుకో వివరించాలంటే ఎన్ని పేజీలు వ్రాయాలి? 

            మొన్న బాగుచేసిన మాఇంటి బయటిగార్డెన్లో  గునపాలతో పారలతో కుళ్ళగించి, మట్టిని తిరగేసి, గడ్డిపరకల్ని ఏరేసి, మళ్లీ కలుపు మొలకలు తలెత్తకుండా శ్రమించిన 15 మందికీ-

            మా ఇంటి  ఉత్తరపు ఖాళీ స్థలం ఇంత అందమైన వీధికి తగినట్లు లేదని, ఆ చీకటిలోనే పిచ్చి చెట్లనూ, గడ్డినీ, తీగల్నీ నరికి, చిట్టడవిని ఛిన్నాభిన్నం చేసిన డజను మందికీ -

            శాయి నగర్ వీధిలో కదలనని భీష్మించిన మురుగు కాల్వను కంపు బురద లాగి మెట్ట తామర మొక్కల్ని పెకలించి, రరకాల వ్యర్థాల్ని  తుడిచిపెట్టిన కష్ట జీవులకీ

            ఇక్కడికి దూరంగా వైజయంతం ప్రహరీ తూర్పు భాగాన్ని నెమళ్ళ, పూల, చిరు పక్షుల చిత్రాలతో నింపుతున్న స్వచ్చ సుందర కళాకారులకీ

            గ్రామస్తుల తరపున స్వచ్చ అభివాదాలర్పించడం తప్ప- కవిత్వీకరించి, వర్ణించి, పొగడ్తలతో ముంచగలనా?

            ప్రతి వేకువా మాలాంటి వాళ్లకు ఆశ్చర్యమూ, సందేహమూ ఏమంటే-అరె! ఇందరు పెద్దలు, గత- ప్రస్తుత ఉద్యోగులు, గృహిణులు,  రైతులు, వ్యాపారులు, ప్రముఖులు ఈ బురద- దుమ్ము- ధూళి- మురికి పనులు చేస్తూ అంతగా సంబరపడతారెందుకాఅని!

            “సొంతానిక్కాక పరుల కోసం కష్టించడంలో ఇంత ఆనందం ఉందాఅని !

 1) స్వచ్చ శుభ్ర సుందరోద్యమాన్నీ, కార్యకర్తల అభిప్రాయాల్ని, వాళ్ల పని పద్ధతుల్నీ రెండు మూడు రోజులుగా దగ్గరగా పరిశీలించిన 6 గురు భాగ్య నగర యువకులు సంతృప్తికరంగా  తమ పని ముగించడమూ,

2) బాపట్ల పాఠశాల విద్యార్ధినీ  విద్యార్ధులు, ఉపాధ్యాయులు స్వచ్చ చల్లపల్లి సందర్శనకు విహార యాత్రగా రావడమూ,

3) తమ 33 ఏళ్ల వైవాహిక ఉత్సవానికి గుర్తుగా లక్ష్మీ సెల్వం దంపతులు స్వచ్చ కార్యకర్తలకు 50 స్టీలు కాఫీ కప్పులు బహూకరించడమూ,

4) విజయా కాన్వెంట్ లో శ్రీ కుమార్ గారు విద్యార్ధులకు కౌన్సిలింగ్ చేయడమూ నేటి విశేషాలు!  నేటి సమీక్షా సభలో నినాదకర్త ల్యాబ్ రవీంద్రుల వారు!

 రేపటి మన వీధి పనులకోసం పద్మాభిరామం వద్ద కలుద్దాం!

               జాగు చేయక సహకరిద్దాం!

సమయ శ్రమదానాల వల్ల మనకు పోయేదేమి ఉంటది?

కొంత తృప్తీ, దైహికంగా మంచి స్వస్తత వచ్చినా రావచ్చు- ఊరికి,

మనకు ఆయువు పెరగవచ్చును- కనుక రేపటి ఉదయమందే

స్వచ్చ సుందర కార్యకర్తకు జాగు చేయక సహకరిద్దాం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

 

   22.12.2024