సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!!
క్రిస్మస్ ముందురోజు పనిదినం సంఖ్య – 3332* వది!
అనగా ఇది మంగళవారం – 24.12.24 వేకువ 4.20 కి ముందే 10 మంది కార్యకర్తలు వాతావరణం బొత్తిగా అననుకూలమైనా సరే - పారిశుద్ధ్య పనుల కోసం కాచుక్కూర్చున్న విషయం గమనించారా?
ప్రగాఢమైన చలిగాలి కెరటాలు, రాత్రంతా కురిసి, అప్పుడే కాస్త తెరపి ఇస్తున్న స్వచ్చ సుందర శ్రమ కథా ప్రతి నాయకుడైన వాన పురుషుడు! ఈ నెలలో 3 వ తీవ్రవాయగుండం తాలూకు చలి తీవ్రత!
“కురిస్తే కురుసుకో - వస్తే చలిగాలులు వీచుకోండి - ఇలాంటివి మేము వందల సంఖ్యలో చూశాం...!” అని ధిక్కరిస్తూ మొత్తం 32 మంది గ్రామ స్వచ్చ యాజ్ఞికులు! వాళ్ల చేతుల్లో గడ్డి, పిచ్చి చెట్లు ఖండించే పదను కత్తులూ, ముఖాల్లో పద్మాభిరామం ప్రక్క ఖాళీ స్థలం కాలుష్యం మీద కసి! ఇలాంటి అరుదైన సామాజిక బాధ్యతా దృశ్యాల్ని ఎన్ని రోజులుగా చూస్తున్నా ఇప్పటికీ ఆశ్చర్యపోతున్న గ్రామ స్వచ్చ వైద్యుడు!
చూస్తుండగానే 6.20 ఐపోయింది. అప్పుడు గమనిస్తే - విశాలమైన ఆ స్థలం రూపం మారిపోయింది. దాని లోపలా, బైటా ఏపుగా పెరుగుతున్న గడ్డీ, పిచ్చి మొక్కలూ, జొన్న దుబ్బులూ తెగిపడగా, నాలుగు దంతెలు వాటిని ప్రోగులు చేశాయి. ప్రోగులేమో డిప్పల్లో దూరి, దూరంగా ఉన్న ట్రాక్టర్లో ఒదిగాయి. ఒక మెకానిక్ దాన్ని త్రొక్కబట్టి అన్ని వ్యర్ధాలూ అణగి మణగి ఉండిపోయాయి!
అప్పటిగ్గానీ కాలుష్యమ్మీద – వీధి అస్తవ్యస్తత మీద స్వచ్చ కార్యకర్తల ఆగ్రహం చల్లార్లేదు!
కాఫీల వేళ ఇద్దరి సరదా కబుర్లిలా ఉన్నవి:
“ఆ! ఏముందిలే బ్రదరూ! ఈ 2 గంటలే కదా - మన మంచి పనుల సంతృప్తీ, సత్కాల క్షేపాలు! హుషారైన ఈ పనులను గుర్తు చేసుకుంటూ గడిపేస్తాను...”
నేటి కష్టం పట్ల DRK గారు సంతోషం ప్రకటించగా, తూము వేంకటేశ్వర మహోదయుడు 3 సార్లు స్వచ్చ - సుందర నినాదాలు వల్లించి, 50 ఎకరాల కలెక్టరేటులో వందలాది చెట్లు నాటుతున్న క్రొత్త విషయం చెప్పగా,
రేపటి 3333* వ నాటి బాధ్యతలు బైపాస్ వీధిగా నిర్ణయించుకొన్నారు.
స్వచ్ఛ సుందర కార్యకర్తగ నిలుచుటంటే
స్వచ్ఛ సుందర కార్యకర్తగ నిలుచుటంటే - గెలుచుటంటే:
మనో నిబ్బర ముండగావలె, సమయదానం చేయగావలె,
ఊరు నాదని జనం కోసం ఉద్యమంగా కదలగా వలె,
స్వార్ధమును చిదిమేసి ఊరికి అండదండగ నిలువగావలె!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
24.12.2024