3334* వ రోజు ....

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!!

బాక్సింగ్ డేనాటి సందర్శనీయ శ్రమదానం - @3334*

          గురువారం - 26-12-24 వేకువ 4.18 నుండి 6.35 కు చివరి కార్యకర్త (తోట నాగేశ్వరరావు) పని విరమణ దాక 2 గంటల 17 నిముషాల సేపు - సగటున ప్రతి కార్యకర్తా గంటా 40 నిముషాలు శ్రమించిన సన్నివేశం!

          కస్తూర్భాయి ప్రాత ప్రభుత్వాస్పత్రి నుండి 150 గజాల బైపాస్ వీధి - క్రొత్తగా వెలసిన సారా అంగడి దాక 33 మంది గ్రామ సేవక శ్రామికులు పట్టి పట్టి శుభ్రపరచిన బాధ్యతా పూరణం!

          పశువుల పేడలెత్తి, లారీల క్రిందకు గూడ దూరి, గడ్డిని పీకి, ప్లాస్టిక్ వస్తువుల్ని ఏరి, దక్షిణం ప్రక్క ఉద్యానాలను శుభ్రపరచి, హద్దులు దాటిన చెట్ల కొమ్మల్ని శిక్షించి, గ్రామ పరిశుభ్ర సుందరీకరణకు ప్రయత్నించిన శ్రమ కోలాహలం!

          గత కొద్దిరోజులుగా వీధి మెరుగుదలకు శ్రమించడం కుదరక - ఈ వేకువ వచ్చి, గంటన్నర కష్టించి, మానసికంగావెలితిని పూడ్చుకొన్న ముగ్గురి (1.వేల్పూరి ప్రసాద్, అంబటి బసవ శంకరరావు, ముత్యాల లక్ష్మి) సంతోషం!

          ప్రధాన బైపాస్ రహదారిలో కార్యకర్తలు క్రిక్కిరిసి పనులు చేస్తుండగా, షణ్ముఖ ఎలక్ట్రానిక్స్ వీధినీ, మురుగుకాల్వనూ బాగుచేసి సంతోస్తున్న ఇద్దరు వియ్యపురాళ్ల కష్టం!

          మోకాళ్ల నెప్పులున్నా అంతెత్తు ట్రాక్టరెక్కి, 5 గురు అందిస్తున్న వ్యర్ధ్యాల్ని క్రమపద్ధతిలో పేర్చి, త్రొక్కుతున్న ఒక కమ్యూనిస్ట్ వీధి కార్యకర్త ఆనందం!

          మొత్తమ్మీద వాళ్ల సామూహిక సత్కార్యాన్ని చూస్తుంటే ఐదు వేల ఇళ్ళూ, పాతిక వేల జనాభా ఉన్న ఒక పెద్ద పంచాయతీ వీధి శుభ్రతలకూ, జనాహ్లాదాలకు భరోసా ఇస్తున్న సామాజిక శ్రమదానం!

     అసలు ఈ కార్యక్రమం 15 నిమిషాలు ముందే పూర్తి కావాల్సి ఉండగా ఒక ఎడమ చేతి కార్యకర్త 6:15 కు విజిల్ ఊదవద్దని, తెల్లారక ముందే మనం ఇంటికి వెళ్లడం ఏమిటని చెప్పడం వలన ఈ ఆలస్యం.

          నేటి శ్రమదానం ముగిశాక - కాఫీపానాలు పూర్తయ్యాక 6.40 కి పసుపులేటి ధనలక్ష్మి గారిననుసరించి 3 మార్లు స్వచ్ఛ - సుందర నినాదాలు పలికాక,

          బైపాస్ వీధి సుందరీకరణ చరిత్రను DRK డాక్టరు గారు గుర్తుచేసి, నేటి కాయకష్టాన్ని కీర్తించాక,

          రేపటి వేకువ పనుల కోసం కూడ ఇదే వీధిలో - సాగర టాకీస్ దరిదాపుల్లోనే కలవాలని నిర్ణయించుకొని, నేటి కార్యక్రమం ముగించారు!

          కానుకగ ఇచ్చేయ జాలును

తలచుకొంటే ఎవ్వరైనా కార్యకర్తగ మారగలుగును

గ్రామముకు తన వంతుగా శ్రమదానమును సమకూర్చవచ్చును

గంట సమయం ఊరి కోసం కానుకగ ఇచ్చేయ జాలును

పౌరుడుగ తన బాధ్యతను నెరవేర్చి తృప్తిని బడయవచ్చును!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  26.12.2024