3341* వ రోజు ....

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!!

క్రొత్త ఏడాదిలో 2 వ నాటి శ్రమ మాహాత్మ్యం! @ 3341*

         బుధవారం వేకువ 4:12 సమయంలో తూర్పు రామాలయం ఎదుట డజను మంది స్వచ్చ కార్యకర్తలు వినయంగా నిలబడటం గమనించండి - అందులో ఒకాయన ఎవరికి నమస్కరిస్తున్నాడో తెలియదు - బహుశా ఆ వీధి పౌరుల్ని గ్రామసేవలకు రమ్మని కాబోలు!

         ఇక అక్కణ్ణుండి 6.25 దాక - మొత్తం 30 మంది వీధి శ్రామికుల బాధ్యతా పరంపర! తలా 2 గంటల శ్రమతో కనీసం సంత వీధి దాక బందరు వీధి నేను స్వచ్చ సుందర చల్లపల్లిలో అందమైన బజారును సుమా! అని ఋజువు చేసుకోవలసిందే గానీ - చేపల దుకాణం - మసీదుల మధ్యకే పరిమితమైపోయింది!

         అందుక్కారణం 2-3 వారాల క్రితం డ్రైన్లోంచి తోడబడి, బిగిసిన మట్టి దిబ్బలు. వాటిని త్రవ్వి, డిప్పల్తో మ్రోసి, ట్రాక్టరులో నింపినదే నేటి ప్రధాన శ్రమదానం! నేటి వాట్సప్ ఫొటోల్లో ఉన్నవో లేవో గాని కొన్ని ముఖ్య సన్నివేశాల్ని ప్రస్తావిస్తాను!

- ఒక రామాలయం ముంగిట మట్టిలో కూర్చొని ముస్లిం కార్యకర్త తదేక దీక్షతో శుభ్రపరచడం,

- ఒక ప్రముఖ టిఫిన్ సెంటర్ యజమానురాలు మసీదు సమీపంలో వంగి పారతో మురుగు మట్టిని డిప్పలకెత్తడం,

- నెలకు లక్షకు పైగా జీతాలు, పెన్షనూ తెచ్చుకుంటున్న వారు దిక్కుమాలిన ప్లాస్టిక్ గాజు సీసాల్ని ఏరి, గోతాలకెత్తడం,

- బత్తుల వారి వీధి ప్రవేశం దగ్గర వాహనాల నడక సాఫీ కోసం ఆకుల వాళ్లూ, కస్తూరి వారూ, సజ్జా మల్లంపాటీ తదితరులూ పాటుబడడం.

- ఈమధ్య శ్రమదానాన్ని తగ్గిస్తున్న కారణంగా గోళ్ల కృష్ణ తడబడుతూ ఎలాగో నినాదాల్ని పూర్తి చేయడం!

         ఈ పూట సమీక్షా సమయంలో తెలిసిన 2 క్రొత్త సంగతులేమంటే :

1) లయోలా ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గారు కర్ణాకర్ణిగా స్వచ్చ సుందర చల్లపల్లిని గూర్చి విని, స్వయంగా వచ్చి, చల్లపల్లి వీధుల్నీ, కుఢ్య సుందరీకరణనూ, ముఖ్యంగా గంగులవారిపాలెం వీధినీ పరిశీలించి, తన మిత్రుడైన ఆయుష్అధిపతి యార్లగడ్డ రమేష్ తో మన కాలనీలో కనీసం ఒక్క వీధినైనా అలా చేయలేమా?” అని ప్రశ్నించడం,

2) నిన్న బందరు కలెక్టరు గారి కార్యాలయంలో వినూత్నంగా జరిగిన వందలాది మొక్కల ప్రతిష్టాపన.

         రేపటి వీధి శుభ్రతా చర్యల కోసం చంటి హోటల్వద్ద ఆగాలని నిర్ణయం!

         స్వయంపు వంశీ కృష్ణ మౌనికల 4 వ పెళ్లి రోజు సందర్భంగా వారి తరపున పరుచూరి బేబీ సరోజిని గారు స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం 500/- రూపాయల విరాళాన్ని అందజేసినందుకు ధన్యవాదములు.

         కుఢ్య చిత్రాల్ లిఖంచుటలో

ODF + చేయడంలో - మరుగు దొడ్లను కట్టడంలో

నాల్గు చోటుల స్వచ్ఛ - సుందర టాయిలెట్ నిర్మించడంలో

ముఖ్య వీధుల నక్కడక్కడ కుఢ్య చిత్రాల్ లిఖంచుటలో

అలసి సొలసిన కార్యకర్తల కందరికి అభివందనమ్ములు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  02.01.2025