3342* వ రోజు....

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!!

11 ఆంగ్ల సంవత్సరాదుల్ని చూసిన శ్రమదాన విజయం @ 3342* 

         నేటి విజయవంతమైన శ్రమ కారకులు 32 మంది. వాళ్ళ కర్మ స్థలి మరొక రోజు (శుక్రవారం3.1.25)  కూడ బందరు రహదారే! తొలుత నిలిచిన అపోలో మందుల షాపుకు కుడి- ఎడమలుగావారి శ్రమ విహారం.  

         కొందరు ఊడ్చినా, పోలీసు స్టేషను వీధి దాక కాలుష్యాల  అంతు చూసినా, ఇటుగా ముత్యాల వారి  టిఫిను సెంటరు ప్రాంతంలో కష్టించినా- ఈ వేకువ కూడ ఎక్కువ మంది శ్రమ మాత్రం వీధి దక్షిణాన మురుగు మట్టి త్రవ్వకమూ, డిప్పల కెత్తి ట్రాక్టర్ లో నింపి, దూరంగా ఉన్న శ్మశానం దగ్గరికి చేర్చడమూ ?

         అలా పారలతో, గునపాలతో ఎండిన మురుగు కంపు మట్టిని మహిళా కార్యకర్తకలు సైతం – త్రవ్వి, గోకి, బరువు డిప్పలు మోస్తుంటే – ఎంత మంచున్నా, చలిగాలి  వీచినా వీళ్ళకేం లెక్క? ఇలాంటి ప్రకృతి ఘాతుకాలు వాళ్ళెన్ని చూడలేదు- ఈ పాటి బరువు పనులెన్ని చేయలేదు?  

         ఇన్ని వేల రోజుల- లక్షల పని గంటల గ్రామ బాధ్యతలు మోస్తున్న కార్యకర్తల శ్రమ పరమార్థం తమ గ్రామ సామాజిక సామూహిక సద్భావనే కదా! అది సిద్ధిస్తుందన్న ప్రగాఢ విశ్వాసమే కదా!

         నాలుగు రోజులుగా కార్యకర్తల కష్టానికి ప్రతి ఫలంగా 1 కిలో మీటరు బారునా బందరు రహదారి ఇప్పుడు స్వచ్చ – శుభ్ర- సౌందర్యాలతో  అలరారుతున్నది గదా!

         ఇప్పుడీ వీధి భాగం గ్రామ పౌరులకు గర్వదాయకం-పొరుగు వీధులకూ- ఊళ్ళకూ అసూయాజనకం!

         6.30 కి షరా  మామూలుగానే సమీక్షా సమావేశమూ అందులో డాక్టరు గారితో బాటు తూము వెంకటేశ్వరుల వారి ‘ బందరు కలెక్టరేట్ లో 1 వ తేదీన ఆదర్శంగా జరిగిన హరిత వన  మహోత్సవ వివరణమూ!

   ఈ తుది సభను నినాదాలతో మొదలెట్టినది పంచాయతి ఉద్యోగి బండి శరత్ గారు.  

         రేపటి వేకువ మనం పోలీసు కార్యాలయం వీధి వద్ద కలవాలని నిర్ణయం!

         ఆది మూలమెవ్వరి శ్రమ?

కళకళ లాడే  ఊరుకు కారణ భూతులు ఎవ్వరు

హరిత శుభ్ర సంపదలకు  ఆది మూలమెవ్వరి శ్రమ

ఎలా నడిచె నింతకాల మీ ఉదాత్త శ్రమోద్యమము   

స్వచ్చ కార్యకర్తలార! సాష్టాంగ ప్రణామము!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  03.01.2025