3343* వ రోజు....

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!!

3343*  వ నాటి శ్రమ సమాచారం ! 

         శనివారం (4.1.2025) వేకువ 4.13 అయిందో లేదో – డజను మంది స్వచ్చ కార్యకర్తలు సంత బజారు ముని వాకిట తయారు! వాళ్ళు చాలరన్నట్లు పావు గంటకు- పావుగంటకూ 3 డజన్ల మంది! ఐతే  వీళ్లలో 5 గురు పంచాయతి పారిశుద్ధ్య కార్మిక సోదరులూ, ఒక ఉడత్తు  రామ్ గోపాలుడూ! అనగా – నికరంగా క్రమం తప్పని కార్యకర్తలు 40 మందీ, మొత్తంగా 46 మందీ!

         “అసలింత  చలేమిటో – మంచు వర్షమేమిటో – వెచ్చగా దుప్పట్లో ముడుచుకోక – ఇంత గుంపెడు  మంది మురికి- దుమ్ము – మురుగు పనుల కోసం వీధుల్లోకి రావడమేమిటో-” అని అప్పుడప్పుడు కొందరు బుర్రలు గోక్కుంటూనే ఉంటారు!

         ఇక- ఈ జనవరి 4 వ వేకువ 2 గంటలకు పైగా అవిఘ్నంగా జరిగిన 60 పని గంటల శ్రమ సంగతి కొస్తే – ముఖ్యంగా షాబుల్ వీధి ఎదుట 3 సెంట్లలోని భారీ డంపును తొలగించిన దృశ్యాన్ని – బొత్తిగా తీరిక లేక గాని – అదంతా కన్నార్పకుండా చూసిన DRK డాక్టరు గారే వ్రాస్తే బాగుండేది! అందుకని ఆయన మాటల్లోనే :

         “ సైన్యంలోని ఒక్కో గ్రూపుకు ఏదొక టార్గెట్ నిర్దేశిస్తూ చేసే మోటివేషన్ తరువాత ఏ వీరూడూ తాను అలసిపోతున్నాడా- గాయపడుతున్నాడా అనే ఆలోచనే ఉండదు. మరి ఏ మోటివేషనూ అక్కర్లేని  ఈ స్వచ్చ సైనికులూ అంతే- గాజు పెంకుల – క్రుళ్లిన ఆహార ఘాటు కంపుల డంపును త్రవ్వి – ఎత్తుతూ బట్టలు మట్టి కొట్టుకున్నాయో – చేతులు గీరుకుపోతున్నాయో అని కాదు – తెల్లారేసరికి దాన్ని  చెత్త కేంద్రానికి చేర్చామా లేదా అనే పట్టుదల మాత్రమే !..

         ATM ల కేంద్రంలో పని చేసిన 16 మంది మాత్రం కాస్త ఇబ్బంది పడ్డారు – “ఆక్రమణల వల్ల సరిగా శుభ్రపరచలేకపోతున్నామే” అని “అయ్యో! పదేళ్లకు పైగా ఇంత శ్రమించిందీ, పేవర్ టైల్స్ తో అలంకరించిందీ ఇలా మోటారు బళ్ల – సెల్ ఫోన్ల , ఇతర అంగళ్ల వారూ పంచాయతీ వారి లిఖిత అనుమతుల్లేకుండానే ఆక్రమించడానికా” అని కూడ దిగులు చెందారు!

         మిగిలిన కార్యకర్తల – ముఖ్యంగా చీపుళ్ళ వారి వీధి శుభ్రతా ప్రయత్నం మాత్రం దాదాపు సెంటరు దాక సాఫీగా జరిగిపోయింది!

         6.40 కి 38 మంది కార్యకర్తల సమావేశాన్ని చాలా రోజుల తర్వాత నేనే  రకరకాల నినాదాలతో ప్రారంభించాను.  అసలు వీటిని అమెరికా ప్రవాసుడు రామ గోపాలుడు చెప్తే  బాగుండేది. అతడు కార్యకర్తలకి శిరసాభి వందనాలొనర్చి, రేపు 12.00 కు వైశ్య వీధి కళ్యాణ మండపంలో తమ తల్లి గారి సాంవత్సరీకానికి రావాలని అందర్ని  అభ్యర్ధించి, తనకు స్ఫూర్తి నిస్తున్న నాదెళ్ళ సురేష్ ను గుర్తు చేసుకున్నాడు!    

         రేపటి వేకువ మన కలయిక ATM కేంద్రం వద్దనని తెలిసింది!

                     ఎంత మాయ చేసితివే 

         ఒక దశాబ్ది క్రితం ఎవ్వరూహించని పెను మార్పులు

         ఉద్యమ కర్తలు చూపిన ఓర్పు కసలు హద్దులేవీ?

         ఉద్యమాలకీ మాత్రం ఊపిరులూదినదెవ్వరు?

         ఎంత మాయ చేసితివే  స్వచ్చ-సుందరోద్యమమా

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  04.01.2025