సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!!
గ్రామ సామాజిక కర్తవ్య పాలనలో 3345* రోజులు
సోమవారం వేకువ 4.20 కన్నా ముందే సదరు కర్తవ్యాలు 11 మందితో మొదలయ్యాయి! తొలుత ATM ల వద్దా, ఆ ఉపరి కెనరా బ్యాంకు పడమర సందులోనూ, ప్రారంభమైన శ్రమదానం మరో 27 గురు వచ్చి కలిశాక బందరు రోడ్డులోనే సెంటరు వైపుకు మళ్ళింది!
శుభ్ర పరచిన చోటుల్లోనే 3 వ మారు కూడ ఈ ఊడుపు లేమిటీ – మురుగు కాల్వలో వ్యర్థాలు తోడు టేమిటీ – ATM కేంద్రాన్ని ఇంకెన్ని మార్లు బాగు చేసి, చిందర వందరగా పడున్న వస్తువుల్ని ఇంకెంత బాగా సర్దుతారూ- చాలా వరకు శుభ్రం గానే కనిపిస్తున్న పెట్రోలు బంకూ, బేకరీ – సైకిలు షాపులూ, వినాయకుని గుడీ మళ్లీ మళ్లీ స్వచ్చ శుభ్రంగా చేయాలా .. అనే సందేహాలు కొందరికి రావచ్చు.
కాని , తెల్లారక ముందే ముప్పనేని మందుల కొట్టు ఎదుట వ్యర్థాలు చిమ్మ బడితేనూ, 3 రోడ్ల సెంటరులో మళ్లీ దుమ్మూ ఇసుకా వచ్చి చేరితేనూ స్వచ్చ కార్యకర్తల మనస్సులెంత చివుక్కుమంటాయో ఆలోచించండి!
కెనరా బ్యాంకు వెనుక సందులో 2 డ్రైన్లను ఇద్దరు ముగ్గురం చెత్త లాగి, గడ్డి పెరికి, ఇంతవరకు చాల్లే అనుకొన్నాం గాని- 3 గ్గురు మహిళా కార్యకర్తలకది చాలలేదు – ఆఅ చిన్న వీధి వీధంతా గడ్డి పరక మిగలకుండా, 6.30 దాక మెరుగులు దిద్దనిదే ఆగలేదు!
6.00 కాక ముందే పంచాయతి కార్మిక, ఉద్యోగు లేడుగురు రానే వచ్చారు. డ్యూటీ లో భాగంగా ముందుగా ట్రాక్టరు నిండా తుక్కులూ, ప్లాస్టిక్ చెత్తలూ నింపనే నింపారు. ఇది కాక-
1) బ్యాంకు ఎదుట ఎత్తు పల్లాల్ని సర్దడమూ,
2) ఎండు డ్రైను మట్టి గుట్టల్లో మట్టినీ, ప్లాస్టిక్ దరిద్రాల్నీ వేరు చేసి, మట్టి ని మాత్రం ట్రాక్టరు లో లోడు చేసి, శ్మశానపు పల్లాల్లో నింపడమూ నేటి శ్రామిక చర్యల్లో కొన్ని!
3 నాళ్లుగా లేని శంకర శాస్త్రి గారు వచ్చీ రావడమే తనివితీరా కార్యకర్తల పనుల్ని చిత్రాలుగా ఫోన్లో బంధించి, ఎప్పటిలాగే ‘ మనకోసం ట్రస్టుకు’ 5000/- విరాళపు చెక్కును ఇచ్చేశారు.
6.40 కి BSNL నరసింహా రావు గారు కాస్త లయ బద్ధంగానూ కొంచెం వయ్యారంగానూ నినాదాలు పలికాక - రేపటి పనుల కోసం 3 రోడ్ల సెంటరు వద్ద కలవాలని నిర్ణయించారు.
కార్యకర్తల శ్రమల హారతి
వెయ్యి మందికి ఒకరు చొప్పున స్వచ్చ సుందర కార్యకర్తలు
కార్యకర్తకు వెయ్యి మందిగ కశ్మలం ఉత్పత్తి చేస్తురు
అన్ని ఊళ్ళకు ఇదే దుస్థితి – అందుకే కొంగ్రొత్త సంస్కృతి
పాదు కొలిపే ప్రయత్నంలో కార్యకర్తల శ్రమల హారతి!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
06.01.2025