3346* వ రోజు....

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!!

3346 * (మంగళ వారం -7.1.2025) న కూడ ఆదే కథ!   

         నిన్నటి నిర్ణయాన్ని బట్టి తొలుత – 4.18 కే 13 గ్గురు 3 రోడ్ల కూడలికి రానే వచ్చారు. తారువాత్తరువాత వాళ్ళు 30 కి పైగా పెంపొందారు, పంచాయతీ  కార్మికులు 6 గురు దీనికదనం. ఒక ప్రణాళిక  ప్రకారం 3 బృందాలుగా విడి, ఒక 6 గురి ముఠా ట్రాక్టరు లో బైపాస్ రోడ్డుకి, 14 గురు గణేశ్ ప్రెస్, సచివాలయానికీ, మిగిలిన వాళ్ళు అవనిగడ్డ- బందరు రోడ్ల సుందరీకరణకీ పూనుకొన్నారు!

         బైపాస్ వీధిలో ప్రాత కస్తూర్బాయి ఆస్పత్రి దగ్గరి రోడ్డు ప్రక్కన పల్లం ఏర్పడిందనీ, ఉపేక్షిస్తే గుంట పెద్దదౌతుందనీ, పెద్ద వాహనాలొస్తే రోడ్డు భద్రత ఉండదనీ శ్మశానంలో నిల్వ ఉంచిన రాతి రద్దును ట్రాక్టర్ లో కెత్తి, ఆ వీధి వైకల్యాన్ని సరిచేసేశారు!

         సచివాలయం- ప్రెస్ ల నడుమ గత నెల వర్షాలకు పిచ్చి మొక్కలూ, తీగలూ- అందులో ఎవరో వేసిన రకరకాల వ్యర్థాలూ కలగలిసి భీభత్సంగా మారిన చోట పని చేసిన 2 వ బృందం ఇంత మంచూ- చలిలో పదేపదే మంచి నీళ్లు త్రాగారంటే అర్థమేమి? చెమట పట్టి దాహమేసిందనే గదా! పంచాయతి ట్రాక్టర్ లో నిండిన వ్యర్థాలన్నీ అక్కడివే గదా!

         ఇక 3 వీధుల కూడలినీ, దక్షిణంగా 100 గజాలనూ, తూర్పుగా బందరు వీధిలో మళ్లీ 100 గజాలనూ సుందరీకర్తలూ + ఇతరులూ ఎంత పట్టుదలగా, నిబద్ధంగా, శుభ్రపరచారో ఫొటోల్లో నైనా చూడండి! ఊళ్లో వాళ్ళకు ఫోటోల తో పనేమి-స్వయంగా – చూడవచ్చునే!

         టీ కొట్లముందరా, శీతల పానీయాల దుకాణాల వద్దా, వస్త్ర దుకాణాల చెంతా, పెట్రోలు బంకుల దగ్గరా, ఇప్పుడొక్క కాగితమ్ముక్కైనా దొరుకుతుందేమో  చూడండి!

         మరి ఇలాంటి వీధులూ, పరిసరాలు కదా- ఏ ఊర్లో నైనా ఉండవలసింది! ఇంత ఆహ్లాదకర వాతావరణం కదా- గ్రామస్తుల ఆయురారోగ్యాలు పెంచగలిగేది!

         6.50 కి ఒక ఎలక్ట్రికల్ / జనరల్ షాపు యజమాని షాపును తెరుస్తూ నాతో అన్న మాటలు- “ఈ 2 వీధులూ ఇంత అద్భుతంగా ఉన్నవి సరే గాని- మరీ 4.30 కే ఇందరు చలిలో ఎలా వచ్చి ఇంత పని చేస్తున్నారు మాస్టరు గారూ”..

 

     చల్లపల్లి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం పోలీస్ స్టేషన్ రోడ్డు – హనుమాన్ నగర్ (గౌడపాలెం) లోని శ్రీ అభయాంజనేయ ఆలయ కమిటీ వారు ఈ రోజు ఒక లక్ష రూపాయలను ‘మనకోసం మనం’ మేనేజింగ్ ట్రస్టీ గారికి విరాళంగా ఇచ్చారు.  

         నేటి స్వచ్చ సుందర నినాదాల వంతు మాలెంపాటి అంజయ్య గారిది, ఈ వీధి సౌందర్య- సౌకర్యాల చరిత్రను టూకీగా గుర్తుచేయడం DRK గారి వంతు,

         రేపటి వీధి మెరుగుదల పనుల కోసం అందరం కలువదగినది అవనిగడ్డ రోడ్డు మొదటనే!

          అదృష్టం పెన  వేసుకొన్నది

ఎక్కడెక్కడ గ్రామ వీధులు చక్కదిద్దిరో కార్యకర్తలు

ఎప్పుడెప్పుడు కార్య శూరులు ఎంచుకొనిరొ శ్మశానమ్ములు,

కాల్వగట్టులు, మురుగు కాల్వలు, గబ్బు గొట్టే మురుగు దిబ్బలు

అప్పుడే గద  చల్లపల్లికి అదృష్టం పెన  వేసుకొన్నది!          

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  07.01.2025