3349* వ రోజు ....

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!!

క్రొత్త సంవత్సరంలో 10 వ రోజు బాధ్యతలు - @3349*

         ఇవి శుక్రవారం వేకువ - అగ్రహారం తొలి వీధి వద్ద ప్రారంభమై, బెజవాడ బాటలోని శివాలయం వద్ద ముగిసినవి. ప్రారంభ, ముగింపు వేళలు 4.20 & 6.20. రోజుకు గంట శ్రమదాన నియమం అటకెక్కి చాలకాలమయింది! నేటి సమయ – శ్రమదాతలు నికరంగా 28 మందీ, మొత్తంగా 32 మందీ!

ఇక ఇందరు 45 పని గంటలు పాటుబడి, కూడబెట్టిన సంపదల వివరాలు:

         - సుమారు 100 డిప్పల మన్నూ - ఇసుకా! దీనితో కొన్ని రోడ్ల గుంటలు పూడ్చగా మిగిలినది శ్మశానానికి చేరి, ఊళ్లో వీధి పల్లాల పూడికకు పనికొస్తుంది.

- బస్తానర ప్లాస్టిక్, గాజు సీసాలూ గ్లాసులూ, కప్పులూ వగైరా. వీటిని కస్తూరి శ్రీను ట్రస్టుకు  కొద్ది ఆదాయ వనరుగా మారుస్తాడు.

- మిగిలిన తుక్కూ, గడ్డీ, చిత్తు కాగితాలూ, హంసా చౌదరి పాలదుకాణంలోని పూజా ద్రవ్య వ్యర్ధాలూ, ప్లాస్టిక్ సంచులూ ఒక గంట తర్వాత పంచాయతి కార్మికులు ఎత్తి, చెత్త కేంద్రానికి చేరుస్తారు.

         ఇదీ ఊళ్లో నిరంతరం జరిగే స్వచ్చ – శుభ్ర - సుందరకరణ ప్రక్రియ! ఇది 7.00 కు ముగిసిందో లేదో ట్రస్టు కార్మికులు నిర్దేశిత గ్రామ విభాగంలో ఎక్కడే పనులు అవసరమైతే - అక్కడ అవి మొదలు పెడతారు.

         ఎందుకీ గ్రామ వీధులు, చుట్టూ రహదారులు, పబ్లిక్ స్థలాలు, బస్ ప్రాంగణమూ, శ్మశానాలు ఇంత ప్రత్యేకంగా ఉంటాయో దీన్ని బట్టి తెలియడం లేదూ! స్వచ్ఛ కార్యకర్తల దెంతటి దృఢ సంకల్పమో అర్థం కావడం లేదూ?

         “గ్రామస్తుల్లో ఇంకా 30-40 శాతం మంది మారి ఊరి స్వచ్ఛ - సౌందర్యాలకు పూచీపడడమూ – లేక కార్యకర్తలే దశాబ్దాల తరబడీ శ్రమదానం చేసీ చేసీ అలసి, ప్రయత్నం మానుకోవడమా?”అంటే - ఎప్పటికైనా మొదటిదే జరగాలి!

         పాల విక్రయ కేంద్రం దగ్గర జరిగిన సమీక్షా సభను కస్తూరి శ్రీను తన నినాదాలతో ప్రారంభించగా, కోడూరు వెంకటేశ్వరరావు 520/- తన నెలవారీ విరాళం అందించగా, డి.ఆర్.కె. గారు సమీక్షించగా,

         రేపటి మన కలయిక శివాలయం వద్దననీ, ఆది, సోమ వారాల్లో సన్ ఫ్లవర్  కాలనీ వీధిలోనని తెలిసి, నేటి కృషి ముగిసింది.

         చేపపిల్లకు ఈత నేర్పుట

చేపపిల్లకు ఈత నేర్పుట, చెంగు చెంగున గెంతడంలో

లేగదూడకు శిక్షణిచ్చుట, లీలగా వీస్తున్న గాలికి

తలలు ఊపుట వరి పొలానికి దగ్గరుండీ నేర్పబోవుట

అలాగుంటది కార్యకర్తకు స్వచ్ఛ కృషి నేర్పింప బూనుట!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  10.01.2025