సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
సంఖ్యాపరమైన మరొక మైలురాయి - @ 3350*
అది శనివారం - 11-1-25 వ రోజుది, 4.19 కే 13 గ్గురితో ముందుగాను, నిముషక్రమాన వచ్చి కలసిన 23 గ్గురితో మెత్తం 36 (+6 గురు పంచాయతి కార్మిక సోదరులు అదనం) తోను నిర్విఘ్నంగా - శివాలయం ముదలుకొని, HDFC బ్యాంకు దాక నెరవేరిన వీధి బాధ్యతలు.
ఆ 200 గజాలు కాక - బెజవాడ రహదారి కటూ ఇటు 3 వీధుల శుభ్ర – సుందరీకరణ పాక్షికంగా! నేను చూసినంతలో 2 మాత్రం మరీ కష్టతరములైన పనులు అవేమంటే:
- అగ్రహారం 3 వ వీధి మొదట్లో డ్రైను గట్టు కేంద్రంగా వెలసిన చెత్త కేంద్రం తొలగింపు కోసం 6 గురు నికరంగానూ, మరో 5 గురు పాక్షికంగానూ శ్రమించడం మొదటిది,
అసలా డంపులోనే ఒక గోతం ప్లాస్టిక్, గాజు సీసాలు దొరికాయంటేనూ, వీధి 2 వైపుల డ్రైను నుండే అరబండి వ్యర్ధాలు లాగి, పంచాయతి ట్రాక్టరులోకి చేర్చారంటేనూ దాని ఘనతను వేఱె చెప్పాలా?
- 2 వ గట్టి పన్లోనూ డజను మంది శ్రమించారు. కొబ్బరి బొండాల – ప్రాత చెక్క సామాన్ల, తుప్పుపట్టిన ద్విచక్ర వాహనాల షెడ్డును తూర్పు డ్రైన్ వద్దనూ తక్కువ వ్యర్ధాలేం దొరకలేదు! అక్కడనే మిగిలిన ట్రాక్టరు నిండిపొయింది!
దుమ్ము ఎక్కువగా క్రమ్మేది మాత్రం అగ్రహారం 2 వ వీధి మొదలూ, కస్తూరి మామ్మ గారి గార్డెన్ వద్దా! అలా ధూళి మేఘంలో చిక్కుకున్న వారు సుందరీకర్తలూ, వాళ్లకు సహకరించిన ఇతరులూ!
రహదారి పడమర మార్జిన్ కూడా ఏమీ తక్కువ తినలేదు – ఆ 100 గజాల బారునా ఆరేడుగురు చీపుళ్లతో ఊడ్చీ, గోకుడు పారల్తో మట్టి గోకీ, పిచ్చి మొక్కలూ, గడ్డీ కత్తుల్తో తొలగించీ గంటన్నర శ్రమిస్తేనే గదా – ఇప్పుడింత చూడముచ్చటగా ఉన్నది?
చివరి అరగంటలో అటు పంచాయతి - ఇటు స్వచ్చ కార్యకర్తల పరస్పర వీధి పారిశుద్ధ్య సహకారం చెప్పుకోదగినదే!
6.30 కు స్వగృహ ఫంక్షన్ హాలు ఎదుట జరిగిన సమావేశాన్ని తన నినాదాలతో ప్రారంభించిన పైడిపాముల కృష్ణకుమారి గారు స్వచ్చ కార్యకర్తలతో ఇకముందు సేకరించే దుమ్మూ – ధూళిలో తమ పంచాయతికి వాటా అడిగారు.
ఆది, సోమవారాల్లో మన వేకువ కలయికలు గంగులవారి వీధికి చెందిన సన్ ఫ్లవర్ రోడ్డులోనని Dr. DRK గారు నిర్దేశించారు!
ప్రారబ్దం మరిచారా
పదేళ్ల నాటి చల్లపల్లి ప్రారబ్దం మరిచారా
పెంటలతో పేడలతో వీధుల గతి గుర్తుందా
శ్రమ చేసిన అద్భుతాల సంగతి గుర్తించారా
ఊరి కొరకు ఇకనైనా ఉద్యమించ వస్తారా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
11.01.2025