3351* వ రోజు ....

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

భోగి పండుగకు ముందునాడు - @3351*

         ఆదివారం – 12/1/25 నాటి సన్ ఫ్లవర్ కాలనీ వీధి శుభ్రతలకు స్వచ్చ కార్యకర్తలు స్వాగతం పలికారు. కడియాల సురేష్ గారి గృహ సముదాయం వద్ద – ప్రొద్దు తిడగుడు పూల బజారు గేటు వద్ద మొదలైన ఎండు, పచ్చి గడ్డి పీకుడులూ, రోడ్డు దక్షిణాన 2 గజాల మేర, ఎత్తుపల్లాలలో 200 గజాల బారునా ఊడ్పులూ, అక్కడక్కడా పిచ్చి, ముళ్ల మొక్కల – తొలగింపులూ 6.28 దాక ఆగనేలేదు!

         అన్ని వ్యర్ధాల్ని ట్రాక్టరు బండిలో తొక్కి, కుక్కి సర్దిన వ్యక్తి బండి శరత్. బాగా ఆలస్యంగా వచ్చిన 4 గురితో సహా, హైదరాబాదీయ కడియాల కుటుంబీకులతో సహా తుది సభికులు 41 మంది.

         వీరిలో కత్తి పట్టినది డజను మందీ, గొర్రుధారులు ఏడెనిమిది మందీ, చీపుళ్ల వారు పది మందీ, మిగిలిన 6-7 గురు చెత్త లోడింగు వీరులు! ఒకరిద్దరక్కడికి కొద్ది దూరంగా – ఖాళీ స్థలంలో నేల చదును చేసి, లాన్ పరుస్తున్నారు! చీపుళ్ల వారే గేదె పేడల్ని, మట్టి పెచ్చుల్నీ గోకుడు పారల్తో గోకి, ఊడుస్తున్నారు!

         అసలిదంతా చల్లపల్లిలో చిరకాలంగా జరుగుతున్న ఒక సమన్వయపూర్వక, కళాత్మక శ్రమదానం! 11 ఏళ్ల కాల పరీక్షకు నిలిచిన గ్రామ బాధ్యతా నిర్వహణం! స్వయం ప్రేరితులై కార్యకర్తలు వీధి స్వచ్ఛ – శుభ్ర - సుందరీకరణలకు తరలి వచ్చే విచిత్రం! ఎన్నో చోట్ల చల్లపల్లి స్ఫూర్తితో మొదలై, కాలక్రమాన ఆగిన ప్రయత్నం!

         సుకవితాసాక్షాత్కారాన్ని మహాకవి శ్రీ శ్రీ “క్షణికమై, శాశ్వతమైన దివ్యానుభవం” అని వర్ణించాడు. ఇక - నాబోటి కొందరికి స్వచ్చ - సుందర చల్లపల్లి నిర్మాణానికి రాళ్ళెత్తుతున్న గ్రామ సామాజిక కార్యకర్తల శ్రమ విహారం ఏరోజుకారోజే ఒక అద్భుతమే!

         6:35 తరువాత - తుది సమావేశం కడియాల వారి ప్రాయోజిత కాఫీలతోనూ, ఎప్పటిలాగే శంకర శాస్త్రి గారి నాణ్యమైన చాక్లెట్ బార్ల వితరణతోనూ, స్థానిక కార్యకర్త, పద్మావతి ఆస్పత్రి లాబ్ టెక్నీషియన్ ఐన బత్తుల రవి నినాదాలతోనూ,    

         రేపటి భోగి మంటల వేడుకలకై అందరూ ఇదే సన్ ఫ్లవర్ కాలనీ దగ్గర కలవాలనే నిర్ణయంతోనూ ముగిసింది!

         ఎదురీతని చెప్పాలో

ఇది బాధ్యత అనదగునో - పరమ మూర్ఖమన వలెనో

మహా త్యాగమన వచ్చునొ - ఎదురీతని చెప్పాలో

సహనాన్నీ ధైర్యాన్నీ సమ్మిళితం చేసిరనో

సామాజిక శ్రమదానపు సత్కర్మాచరణమనో!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  12.01.2025