సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
23-1-25 – గురువారం నాటిది 3362 వ నాటి స్వచ్చ దిన చర్య!
అనుకొంటే - అది వేకువ 4.6 కే P. K.పల్లి - బండ్రేవుకోడు వంతెన ప్రక్క - అట్టల కంపెనీ ఎదుటనే ప్రారంభమయింది! 6.24 కు అసలు బాట 100 గజాల తర్వాత ముందు కుడి రోడ్డుకూ, తరువాత ఎడం వైపుకూ అంటే వాసవీ కల్యాణ మండపం వెనుక రోడ్డుకూ మలుపులు తిరిగి ఆగింది.
పరిమిత కార్యకర్తల సుందరీకరణ బృందం నిన్నటి పని చోట ఏదో లోపం కనపడితే గంటకు పైగా అక్కడే శ్రమించింది.
“తారీఖులు దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్ర కర్ధం...” అని శ్రీశ్రీ తొంభై ఏళ్ల కిత్రం వ్రాసినట్లు – “అదిగో ఆ డజను కార్యకర్తలు మిల్లూ – ప్రాత చంద్ర హాస్పిటల్ వద్ద బాగుచేశారు, మాంస దుకాణాన్ని ఈ ఆరేడుగురు శుభ్రం చేశారు,” ఈ 150 గజాల వీధిని ఈ 5 గురు మహిళలు భలే ఉడ్చారు....” అనైతే వ్రాస్తున్నాను గానీ...
ఈ పూట – దారుణమైన చలిలో, వీధి దీపాల వెలుగు కూడ కనపడని మంచులో గృహిణులు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, కర్షకులు ఎందుకిక్కడి దాక వచ్చి, ఈ రోత మురుగు పనులు చేస్తున్నారో,
పాతిక వేల గ్రామస్తుల సువిశాల గ్రామానికి ఈ 27 మంది మాత్రమే ఎందుకు బాధ్యత వహిస్తున్నారో,
పోనీ – పదేళ్లుగాదు మరో 10 ఏళ్ళకైనా అన్ని వార్డులు – అన్ని వీధుల జనులూ ఎక్కడికక్కడ ఒక గంగులవారిపాలెం వీధిలాగా, మరొక సామ్యవాద వీధిలాగా శుభ్ర సుందరీకరణకు పూచీ పడతారో....
అనే విషయాలు గట్టిగా చెప్పలేకపోతున్నాను. “అసలెందుకీ 3362* రోజులు – నాల్గు లక్షల పని గంటల శ్రమదాన ప్రస్థానం?” ఏ వెలుగులకీ పయనం? ఎప్పటికీ దిగ్విజయం?” అంటే మాత్రం
“ఇదంతా ఒక గ్రామ సామాజిక చైతన్యం కోసం, ఒక స్వచ్ఛ శుభ్ర - సుందర గ్రామ నమూనా కోసం ఇందరి ఆరాటం” అనైతే చెప్పగలను.
నేటి పని వీధికే చెందిన గోళ్ళ వెంకటరత్న ప్రవచిత నినాదాలతో, DRK గారి సమీక్షా వచనాలతో,
రేపటి శ్రమ కార్యక్రమం వివేకానంద - విజయ కళాశాలల వద్ద నుండి అనే నిర్ణయంతో ఈ పూట పనుల సందడి ముగిసింది!
సురేశ్ నాదెళ్ళెపుడొ చెప్పెను!
“స్వచ్ఛ సుందర ఉద్యమానికి అతికినట్లుగ అన్నీ అమరెను
సమాలోచన, సదాచరణా, ధనం ఇంధన సమీకరణా
కవీ - గాయక వశీకరణా, కార్యకర్తల శ్రమీకరణా
మేలికలయిక ఇదే” నంటూ సురేశ్ నాదెళ్ళెపుడొ చెప్పెను!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
23.01.2025