3364* వ రోజు ....

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

4:20 నుండే విజృంభించిన వీధి పారిశుద్ధ్యం - @3364*

          శనివారం (25-1-25) కావడం వల్లనేమోగానీ, “ఆగిరిపల్లి ప్రయాణం వల్ల 20 మందైనా కార్యకర్తలు వస్తారా?” అని శంకించాను గాని కొంచెం వెనకా ముందుగా 33 మంది స్వచ్చ కర్మిష్టులు పెదకళ్ళేపల్లి వీధిని ఆక్రమించారు.

          విద్యుత్ ప్రసారం ఐదుంబావుకే నిలిచిపోగా, చాలీచాలని తల దీపాల వెలుగులోనే 2  వీధుల పనులూ 6.05 కు ముగిశాయి. 100 నిముషాల వేకువ ఘడియల్లో పూర్తయిన వీధి బాధ్యతలేవనగా:

1) వాసవి కళ్యాణ మండపం వెనుక తట్టున మొన్న మిగిలిన జంగిల్ క్లియరెన్సు. ఇందులో 7 గురి పాత్ర ఉన్నది. సుందరీకర్తలుంటే అక్కడ శుభ్రత తోటే అగిపోరు గదా!

2) గోళ్ళ వారి వీధి సిమెంటు రోడ్డు ప్రక్కన 10 గజాల దాక మెరక వేసి, దాని మన్నికకు హామీ ఇచ్చారు.

3) మాంస దుకాణం ఎదుట రోడ్డు భద్రత కోసం శ్రమించినది 10 మంది. దూరంగా దొరికిన మట్టిని సంగ్రహించి, రాతి ముక్కలు పరచిన చోట విరజిమ్మి ఇంత చలిలో వారి చెమటలు చూస్తుంటే – “ఇదీ గ్రామ సమాజం పట్ల బాధ్యతంటేఅనిపించింది.

4) ఎక్కడ ఊడ్వాలో, ఏ మూలమూలల ఆకులలముల్ని బైటకు రప్పించాలో మహిళలకు బాగా తెలుసు.

          పుట్టుకొచ్చిన అన్ని వ్యర్ధాల్ని డిప్పలకెత్తి మోసి, ట్రాక్టర్ లో నింపే డ్యూటీకి ఐదారుగురు దిగారు.

          వీధి పారిశుద్ధ్య పనుల పరస్పర సహకారం గానీ. సమన్వయం గానీ, చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల ప్రత్యేకతలనుకోవాలి.

          6.25 దాక నడిచిన సమీక్షా సభలో నినాదాల్ని తు.చ.తప్పకుండా ప్రకటించినది కొర్రపాటి వీరసింహుడు.

          మన శ్రమదాన దృశ్యాల్ని చూసిన ఆనందప్రపూర్ణ వీణ (Hyd) గారి స్పందనను తెలిపి, మన స్వచ్ఛ - సుందర ఆహార్యంతో, 8.00 కి పద్మావతి ఆస్పత్రి వద్ద ప్రయాణ సన్నద్ధులై ఉండాలని గుర్తుచేసినది DRK గారు.

          రేపటి వేకువ శ్రమదానం కూడ ఇదే కళ్లేపల్లి మార్గమందే!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   25.01.2025