సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
ఆదివారం (26-1-25) రిపబ్లిక్ డే శ్రమ - @3365*
నిన్నటి ఆగిరిపల్లి ప్రయాణ బడలిక వల్ల ఈ వేకువ సమయాన కార్యకర్తల సంఖ్య తగ్గుతుందనుకొన్నాగాని, ముప్పై ముగ్గురితో ఫరవాలేదనిపించింది. ఐతే ఈ సంఖ్యలో ముగ్గురు పంచాయతి సిబ్బంది, రాష్ట్ర గవర్నర్ గారు DRK – పద్మావతి గార్లకు పంపిన అహ్వాన పత్రాలందించేందుకు R.I. తూము వేంకటేశ్వరరావు వచ్చారు.
శనివారం వేకువ వీధి మార్జిన్ పల్లాల పూడిక జరిగిన ప్రాంతంతోబాటు HP గ్యాస్ కంపెనీ దాటి ఈ పూట శ్రమదానం ప్రసరించింది.
మాంసం కొనుగోలు దారులు డజన్ల మందిలో గాని, ఇతరులు గాని – ఏ ఒక్కరూ కార్యకర్తలతోబాటు పనికి దిగనే లేదు. డ్రైన్ల జోలికి పోకుండానే బాట ప్రక్కల పిచ్చి మొక్కల, గడ్డి గలీజులతోనే మళ్లీ సగం ట్రాక్టరు నిండినే నిండింది!
సింగిల్ యూజు ప్లాస్టిక్ లు మాత్రం కాస్త తక్కువగా దొరికాయి. చీపుళ్ల ఊడ్పులూ, దంతెల వాడకాలూ షరామామూలే! దుమ్ము, డిప్పల మోతలూ అంతే!
గణతంత్ర దినోత్సవం కావున
- ఆదినారాయణుని పుష్పగుచ్చాలూ, గోళ్ల వెంకటరత్న ప్రాయోజిత జున్నులూ, ఆస్పత్రి పనుపున చక్కెర కేళీ పండ్లూ, ప్రోటీన్ సమృద్ధ పప్పుండలూ పంచబడ్డాయి.
విజయా కళాశాల ఎదుట 6.30 కు జరిగిన సమావేశమును పంచాయతి అధికారి మాధవేంద్రరావు గారు నినాదాలతో ప్రారంభించి, గ్రామ పారిశుద్ధ్యమును గూర్చి వివరింపగా,
నిన్నటి ఆనందలోయ (హ్యాపీ వ్యాలీ స్కూల్) పాఠశాల సందర్శనానుభవాన్ని వేముల శ్రీనివాసు గారు వ్యక్తీకరించగా,
వీధుల్లో గాజు సీసాల ప్రమాదాన్ని పేర్కొనే సందర్భంలో ఒక “ఏనుగు డాక్టరు” కథను DRK గారు విన్పించగా,
సోమవారం నాటి మన కలయిక H.P. గ్యాసు కంపెనీ వద్దనని నిర్ణయింపగా,
నేటి 2 గంటల కార్యక్రమం ముగిసింది.
లోక్ నాయక్ ట్రస్టేమో
ఐనా పొంగిపోయేందుకు అసలేముందిందులో?
సంఘజీవులం కనుకనె సామాజిక బాధ్యతలను
కాస్తకాస్త పాటిస్తూ కదిలాం మునుముందుకు
లోక్ నాయక్ ట్రస్టేమో పాటించెను స్వధర్మం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
26.01.2025