సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!
సంతృప్తి మిగిల్చిన 3367* వ నాటి శ్రమ!
మంగళవారం – 27/1/25 వ వేకువ నాటి పరిస్థితన్నమాట! వేకువ 4.16 కే HP గ్యాస్ కంపెనీ వద్ద వాలిపోయిన ఏడెనిమిది మందితో సహా మొత్తం నికర శ్రామికులు 24 మంది కాక - హైద్రాబాద్ నుండి 5.35 కు బస్సు దిగి సరాసరీ 5.45 కు పని స్థలం చేరుకొన్న నేను కాక - అప్పటి దాక ధ్యానంలో మునిగి వచ్చిన గోళ్ళ వెంకటరత్నమూ, ట్రస్టు కార్మిక వీరయ్యా – ముగ్గురం కొసరు కార్యకర్తల మనుకోవాలి!
పెదకళ్లేపల్లి బాటలోని గ్యాసు కంపెనీ నుండి ఈ పూట కూడ దక్షిణంగా శ్రమదానం ఒక్కడుగూ పడలేదు. అందుక్కారణం వంతెన దాటగానే అక్కడ కార్యకర్తల దృష్టిలో పడిన మురుగు మట్టి దిబ్బా, పనికొచ్చే రాతి రద్దు మిశ్రమమూ! నిన్న షెడర్ లో పొడి చేసిన కొబ్బరి బొండాల స్థలం ఖాళీగా ఉంటే - అక్కడ -
ముందుగా రాతి ముక్కల వేస్టునూ, దానిపైన మట్టినీ అమర్చి, ఇప్పుడు రోడ్డు ఎంత శుభ్రంగా, విశాలంగా కనిపిస్తున్నదంటే - అక్కడిక ఏ రాత్రి హఠాత్తుగా ఏ బడ్డీ కొట్టు వెలుస్తుందో, మళ్లీ వాహనాల నిలుపుదల కవకాశం లేకుండా పోతుందో - అనేంతగా!
కేవలం కత్తెర్లతో రోగుల అవయవాలు కత్తిరించి, కుట్లు వేసే సున్నితమైన చేతులూ, 70-80 ఏళ్ళ వృద్ధ హస్తాలూ ఈ మొండి పనులకు దిగడమే ఇక్కడి విశేషం!
“మా ఊరి చక్కదనానికీ, సౌకర్యకల్పనకీ ఈ మాత్రం కష్టిస్తున్నాం చాలు” – అనుకొంటూ - నడుము నొప్పుల కోసం బెల్టులూ, మోకాలి చిప్పల భద్రత కోసం తొడుగులూ బిగించుకొని, గంటన్నర పాటు నడుమెత్తక శ్రమిస్తేగాని తృప్తిగా రోజు గడవని కార్యకర్తల మీద ఏం కామెంటు చేయగలను?
నాలుగు రోజుల విరామం తర్వాత మళ్లీ శ్రమదానంలో వ్రేలు బెట్టిన డాక్టరు గోపాలకృష్ణుల వారే నేటి నినాదకర్త! వీధి శ్రామికుల నేటి కృషిని కీర్తించి, “ఏనుగు డాక్టరు” కథను తప్పక చదవండని అభ్యర్థించిన DRK గారే -
రేపటి శ్రమదానం కోసం గ్యాస్ కంపెనీ వద్ద కలుద్దామని ప్రతిపాదించారు.
చారిత్రక యదార్థం!
మనమే దేశంలోనే మునుముందుగ ఘనకార్యం
చేశాం - చేస్తున్నామని చెప్పుటెలా నేస్తం?
మనకన్నా ఇంతకన్న మంచి పనులు ఎందరో
సాధించారని చెప్పుట చారిత్రక యదార్థం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
28.01.2025