3368* వ రోజు ....

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

బుధవారపు పని దినం క్రమసంఖ్య – 3368*

         29.01.2025 వేకువ శ్రామికుల సంఖ్యేమో 25+1. చివరి ఒంటరి కార్యకర్త అప్పటి దాక ధ్యాన నిమగ్నుడైన గోళ్ళ వేంకటరత్నమే! ఇక – ఇందరి తలా 2.00 గంటల కాయకష్టమేమో HP గ్యాస్ కంపెనీ కేంద్రంగా P.K. పల్లి వీధికే సమర్పితం! ఇక్కడ నుండి 4 వారాల దాకా – శివరాంపురం, వీలైతే వెంకటాపురం దాకా ఈ 2-3 కిలోమీటర్ల బారునా స్వచ్చ కార్యకర్తల శ్రమ తపస్సు ఈ రోడ్డుకు దక్కనున్నది!

         ఇంతా జేసి వారం రోజులపైబడి బాగుపడింది నిండా కిలోమీటరు లేదు గాని, కొంచెం జిజ్ఞాసకల ఊరి జనులెవరైనా వెళ్ళి చూడండి - రోడ్ల ప్రక్కన ఎన్ని గుంటలు పూడాయో - ఎన్ని మురుగు మట్టి దిబ్బలు అదృశ్యమై, ఆ 150 గజాల బాట ప్రాంతం విశాలంగానూ, సౌందర్య స్పృహగలవారికెంత ప్రీతి పాత్రంగానూ కనపడుతున్నదో!

         అసలు కార్యకర్తలే ఊహించలేదు – నాలుగు ట్రాక్టర్ల రద్దూ, మట్టీ అక్కడ దొరుకుతుందనీ, మరీ ఇంత సౌకర్యవంతంగా ఈ వీధి మారుతుందనీ! మానవ శ్రమ ప్రభావం అలా ఉంటుంది మరి!

         గ్యాస్ కంపెనీ దక్షిణాన, గోడౌన్ల ఎదుటి డ్రైన్లలో 15 మంది శ్రమను చూసే అదృష్టం దక్కింది నాకు! ఐతే అక్కడి గృహస్తులు గాని, వ్యాపారులుగాని, ఈ పనుల్లో పాల్గొనకపాతే పోయిరి, కొద్ది సమయమైనా ఈ స్వచ్ఛ – సుందరీకరణకు సాక్షులైనా కారు!

         ఇక - మరొక జంట – ఒక AE, ఒక చెక్ పోస్టు ద్వయం 3 చోట్ల వీధిని సంస్కరించటం చూశాను. ఒక్క విషయంలో మాత్రం ఇద్దరూ పరస్పర విరుద్ధం – ఒకాయన మరీ సైలెంట్ వర్కర్, ఇక రెండో వీరుడి కేకల సందడికైనా అక్కడి వాళ్లు నిద్ర లేచి రాకపోతిరే!

         నేటి తుది సభలో నినాదాల్ని మ్రోగించింది విశ్రాంత LIC మేనేజరు జాస్తి ప్రసాదు; DRK ప్రసాదు గారు చెప్పేవి, కార్యకర్తలు వినేవీ “అందరం కోట్లు సంపాదిద్దాం, జల్సాగా బ్రతుకేద్దాం....” లాంటి కబుర్లేం కాదుగా!! గుంటూర్లో 87 ఏళ్ల వృద్ధ కార్యకర్త హనుమంతరావు రోజూ శ్మశానాల్ని బాగుచేస్తున్నలాంటి సంగతులే గదా!

         మన రేపటి వేకువ శ్రమదానం విజయ క్రాంతి కళాశాల నుండి మొదలగుతుందట!

         అందుకొనుట సహజము!

ప్రజాజీవితపు దారుల పయనించే వారికి

అప్పుడపుడు కాస్త చేదు అనుభవాలు తప్పవు

అవి దాటుకు వచ్చేసిన స్వచ్ఛ ఉద్యమానికి

అవార్డులూ – రివార్డులూ అందుకొనుట సహజము!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   29.01.2025