3369* వ రోజు ....

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!!

ఒకవేళ గురువారం (30.01.2025) వేకువ శ్రమను 3369*

         ఈ జాతిపితను చక్కగా హత్య గావించిన నాటి వేకువ 4.15 కన్న ముందే  పెదకళ్లేపల్లి వీధిలోకి ఇంత వరకూ శ్రమదానాన్ని ప్రత్యక్షంగా చూడని. సుహృదయుడెవరైనా వచ్చి చూస్తే...

         ముందుగా ఇదేమిటి? ఇందరు మర్యాదస్తులు ఇంత చలిలో ఇక్కడ చేతొడుగులేసుకొని, చీపురో పారో - డిప్పో పట్టుకొని, కంపుల వ్యర్ధాల చోట పారిశుద్ధ్య పనుల్లో దిగడమేమిటి?” అని కాస్త విస్మయానికి గురికాగలరు!

         ఇందరు ప్రస్తుత, విశ్రాంత ఉద్యోగులు అటు మురుగు కాల్వల్లో ఇటు వీధి ప్రక్క గోడౌన్ల ఆవరణల్లో ప్లాస్టిక్ - గాజు సీసాలు ఏరి, నోటితో పలకలేని కంపు పదార్థాల్ని డిప్పల్తో మోస్తున్నారా?" అని ఆశ్చర్య చకితులు కాగలరు!

         ఈగృహిణులు, రైతులు, వ్యాపారులు, మంచి హోదా గల డాక్టర్లు 11 ఏళ్ళ నుండీ చల్లపల్లిలో చేస్తున్న పారిశుద్ధ్య క్రీడలివా?” అని నమ్మక తప్పదు!

         60 ఏళ్ళ ఆ రైతు ఇంటి పొలం పనులు కాక - ఈ ట్రాక్టరెక్కి ఇన్ని వ్యర్ధాల్ని త్రొక్కి సర్దడమేమిటిఅని సందిగ్ధంలో పడవచ్చు.

         అతడే గనుకఓపిగ్గా 6.20 దాక ఈ 200 గజాల వీధిలో 26 మంది శ్రమ విన్యాసాల్ని పరిశీలిస్తే - ఇన్ని వేల రోజుల గ్రామ సుందరీకరణ ప్రయత్నాన్ని తెలుసుకొంటే - ఈ చల్లపల్లి 11 ఏళ్ళ నాడెలా ఉండెనో ఇప్పుడెలా మారెనో గుర్తుచేసుకోంటే - ఇకముందాతడు గ్రామ సమాజ సేవలో పాల్గొన్నా పాల్గోవచ్చు!

         6:20 తర్వాత కార్యకర్తలందరితో కలిసి కమ్మని కాఫీ, సేవించి, పౌర శాస్త్ర అధ్యాపకుడు వేముల శ్రీను గట్టిగా వినిపించిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలకు ఉలిక్కిపడి, సర్దుకొని, మిగిలిన వారితో గొంతు కలిపి, DRK గారి సమీక్షా వచనాలను వినగలడు!

         రేపటి రకరకాల వీధి పారిశుద్ధ్యం పెదకళ్ళేపల్లి రోడ్డులోని మూసేసిన శ్రీనీత దాణా ఫ్యాక్టరీ వద్ద నుండే అనీ తెలుసుకోవచ్చు!

         ఎంత పెద్ద వరమోగద

ఎంత మంచి గుణమోయీ ఊరి కొరకు శ్రమదానము

ఎంత పెద్ద వరమోగద ఇందరితో సావాసము

ఎచట ఇంత త్యాగ బుద్ధి - చల్లపల్లిలోన తప్ప!

ఏ ఉద్యమ మిన్ని నాళ్లు - ఈ గ్రామములోన కాక!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   30.01.2025