1979* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు. 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1979* వ నాటి గ్రామ కర్తవ్యాలు :

 ఈ ఆదివారం వేకువ 3.58-6.10 సమయాల నడిమి కాలంలో- కరోనా కష్ట సమయంలో కూడ- గ్రామ స్వచ్చ- శుభ్రతలకు కట్టుబడిన 40 మంది స్వచ్చ సైనికుల సామాజిక బాధ్యతలు యథావిధిగా కొనసాగినవి. శుభ్ర సుందరీకృత ప్రాంతం – బందరు జాతీయ రహదారిలో- భగత్ సింగ్ డాక్టరు గారి + అమరావతి రాజు గారి+3 రోడ్ల కూడలి.

కర్మల భవనం, 1 వ వార్డు ముఖ ద్వారం, సజ్జా వారి వీధి, మునసబు వీధి కలయిక ప్రాంతం 15 మంది కార్యకర్తల చీపుళ్ల కృషితో బాగా మెరుగుపడినవి. అమరావతి రాజు గారి ప్రహరీ వెలుపల స్థలంలోని ఉద్యానవనాన్ని మహిళా కార్యకర్తలు ఎంతగా వ్యర్ధాలను ఏరి ఎండుటాకులు, చెత్త ఊడ్చి, గడ్డిని పీకి శుభ్ర పరిచారంటే- అది స్వయంగా ప్రతి గ్రామస్తుని వీక్షణైకవేద్యం! అనుసరణీయ- ఆనందమయ ప్రయత్నం!

సుమారు 15 మంది కార్యకర్తలకు, సుందరీకరణ బృందానికి బందరు దారికి ఉత్తర దిశలోని అమరావతి రాజా గారి వైజయంతము’(ఇంద్రుని రాచ నగరు) ప్రహరీ ఎన్నెన్నో గోడ పేపర్ల తో అందవిహీనంగా కనిపించింది. అంత పెద్ద గోడ మీద ఎక్కి, ద్వారాలతో సహా వెలుస్తున్న పాత రంగుల్నీ గోకి, కడిగి శుభ్ర పరిచారు.  దీనిమీద కొన్నాళ్ల తర్వాత చూడండి-రంగు రంగుల బొమ్మలు, స్వచ్చ నినాదాలు, చిత్ర లేఖనసందేశాలు వచ్చి, కనులకు మనసుకు విందు చేస్తాయి! ప్రస్తుతానికి, మాత్రం ప్రాతూరి శంకర శాస్త్రి గారి కార్యకర్తల కృషి వివరాల ఫోటో లను వాట్సాప్ మాధ్యమంలో చూడండి!

మొన్న మొన్నటి దాక అమాయక గ్రామస్తులు కొందరిని పీడించిన అనుమానం - ఈ కార్యకర్తలకు రోజువారీగా- భారీగా ప్రతి ఫలం ముట్టు తున్నదనే! అది వారి ధర్మ సందేహం! కాలుష్యం, అపరి శుభ్రత, అస్తవ్యస్తత వంటివి ఎక్కడ కనిపించినా సహించని- భరించలేని నైజం స్వచ్చ కార్యకర్తలది.

సజీవ మత్స్య విక్రయశాల దాక బందరు మార్గం 6.00 కు చూస్తుంటే ఎంత తృప్తి! దీన్ని ఈ పూట సాధించిన  కార్యకర్తలకెంత ఆత్మానందం!

రేపటి మన స్వచ్చంద శ్రమదానం కోసం విజయవాడ రోడ్డులో పెట్రోలు బంక్ వద్ద కలుసుకుందాం.  

          స్వచ్చంద నివాళి

కరాళ నృత్యం చేస్తూ- కరోన కబళిస్తుంటే

కబంధ హస్తాలు చాచి- కౌగలింప జూస్తుంటే-

ఇపుడు గూడ గ్రామస్తుల హితవు కొరకు పాటుబడే

స్వచ్చ కార్యకర్తల ఘన చరితకు నా నివాళి!

 

  నల్లూరి రామారావు

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు

శనివారం – 12/04/2020

చల్లపల్లి.  

 

3.57 కు చిన్న రాజా గారి ఇంటి వద్ద