ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1980* వ నాటి శ్రమదాన సంగతులు :
ఈ నాటి వేకువ 4.03-6.10 వేళల నడుమ త్రిముఖంగా సాగిన కార్యకర్తల స్వచ్చంద సేవలు తమ గ్రామ పవిత్ర బాధ్యతా నిర్వహణకు సాక్ష్యాలు! బందరు జాతీయ రహదారిలో, విజయవాడ బాటలో, కోమలానగర్ లో సదరు బాధ్యతా నిర్వాహకులు 32 మంది!
గ్రామ సుందరీకరణ కంకణ బద్ధులు అమరావతి రాజా గారి “ వైజయంతము” ప్రహరీకి నిన్నటి కృషి తరువాయిగా కొందరు ఆ పెద్ద గోడను గోకి, వెలిసిన రంగును దులుపుతుంటే- మరికొందరు దానిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి, ప్రైమరు పూశారు. ఈ భారీ కుఢ్య సర్వాంగ సుందరీకరణకు ఈ పూత నాంది అన్నమాట!
NTR పార్కు సమీపంలో తమ (పని) ముట్ల బండిని నిలిపి, పలుగులు, పారలు, చీపుళ్లు, చెక్కుడు పారలు ధరించిన స్వచ్చ సైనికులు ఆ ప్రాంతపు మురుగు కాల్వల కాలుష్యం మీద అక్షరాల యుద్ధ మే చేశారు. విజయా కాన్వెంటు నుండి పార్కు దాక- గతంలో పంచాయతి కార్మికులు త్రవ్వి, లాగి, గుట్టలు పెట్టిన తడి మురుగు మట్టి ఎండిపోగా, ఆ గుట్టలను త్రవ్వి, దారి ప్రక్క పల్లాలలో సర్ది, ఆ ప్రాంతపు అందానికి అందం, రహదారి భద్రతకు భద్రత కలిగించారు.
కొందరు కార్యకర్తలు విజయవాడ బాటకు పడమర ప్రక్క డ్రైనును, కోమలా నగరు వీధిని పిచ్చి-ముళ్ల మొక్కలు నరికి, ఎండు తుక్కు, ప్లాస్టిక్ సంచులతో సహా ఖాళీ మద్యం సీసాలను కూడ దంతెలతో లాగి, చీపుళ్లతో ఊడ్చి, తమది కాని వీధి శుభ్రతకు బాధ్యత వహించారు.
ఎండ-వానలు, చలి-మంచులు తుఫానులు, కరోనా ప్రళయాలు- వేటికీ బెదరని స్వచ్చ కార్యకర్తల నిరంతరాయ – నిస్వార్ధ గ్రామ కర్తవ్య నిర్వహణం చూస్తుండగానే 1980 రోజులు గడిచి , 2000 రోజులు దిశగా అడుగులు వేస్తున్నది.
తాను ఎక్కడున్నా- అన్ని సమయాలలోను చల్లపల్లి సుందరీకరణ నే స్వప్నించే- శ్వాసించే- కష్టించే దేసు మాధురి ఈ సందర్భంగా 6.20 సమయంలో సహ కార్యకర్తలందరికి మిఠాయిలు పంచడం నేటి విశేషం!
రేపటి మన సశేష కృషిని విజయవాడ రోడ్డులో పెట్రోలు బంక్ దగ్గర ప్రారంభిద్దాం!
వివరంగా ప్రకటిస్తా
గ్రామం ప్రతి మూల మూల ప్రతి బాధ్యత స్వీకరించి
దారులూడ్చి- మురుగులెత్తి-దర్శనీయములుగ మార్చి
వినోదాలు- విజ్ఞానం విహరింపగ చేసి చూపి
స్వచ్చోద్యమ దీపాలను ప్రజ్వలింప జేశారని....
నల్లూరి రామారావు
సభ్యులు- మనకోసం మనం ట్రస్టు
సోమవారం – 13/04/2020
చల్లపల్లి.