3392* వ రోజు ... ....

 నారచేతి సంచులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామన్లు దేనికటా!!

2 గంటలు X 44 మంది శ్రమ = 2 ఊళ్ల వీధుల మెరుగుదల! - @3392*

            అది 22.2.25 - శనివారపు సమాచారం. శుభ్రంగా, అందంగా తయారైనది

1) చల్లపల్లి సంత గోడలు,

2) క్రొత్త శివరామపురం ముఖ్య వీధి.

ఇతర వివరాలను స్థూలంగా చెపుతాను:

1) 2 గ్రామాల సుందరాకృతుల కోసం 4 గ్రామాల కార్యకర్తలు 44 మంది వేకువ 4.12 - 6.22 వరకు అనగా 2 గంటలకు పైగా శ్రమించడం.

2) ఇంత అననుకూల పరిస్థితిలో జరిగే మురికి పనుల్లో ఎవరైనా గంటకే అలసిపోతారు, చిరాకు పడతారు. కాని ఇదేం వింతో గాని - 2 వ గంటలో కార్యకర్తల ఉత్సాహం పెరిగిపోతుంటది!

3) ముళ్ల - తీగల - చిక్కుపొదల్లో ఏ పామూ - పుట్రా ఉంటుందో అనే సంకోచాలు వీళ్లు పదేళ్లనాడే వదిలేశారని తెలుసుగాని, 10-12 ఏళ్ల పిల్లలకూ, స్త్రీలకూ ఆ సందేహమే రాకపోవడం.

4) తమ ఇళ్ళ వద్ద ఇంత సందడి చెలరేగుతున్నా, షెడ్డర్ ఘోష చెవుల్లో గింగురుమంటున్నా, జరుగుతున్నది తమ సౌకర్యనిమిత్తమని తెలిసినా - 5 గురు గృహస్తులు తప్ప ఎవరూ పట్టించుకోకపోవడం.

5) షెడ్డర్ పొడి చేసిన ½ ట్రక్కు వ్యర్ధాలు కాక - ఇద్దరెక్కి, త్రొక్కి, పెద్ద ట్రాక్టర్ లో పట్టిచ్చిన 1 ½ ట్రాక్టర్ నిండా వ్యర్ధాల సేకరణ!

6) నిన్నటి దాక పరవాలేదనిపించిన ఊరి మెయిన్ వీధి స్వచ్ఛ - శుభ్రతలు ఈ 2 గంటల శ్రమదానంతో "శెభాష్" అనేలా మారడం.

7) సంత గోడల మీద మంచి బొమ్మల చిత్రణ కొనసాగుతుండడం.

8) స్వచ్ఛ సుందరోద్యమంలో తన పునః ప్రవేశ సూచికగా ప్రాతూరి శాస్త్రి గారి చాక్లెట్ల పంపకము!

9) మనుమడి జన్మదినం గుర్తుగా కొర్రపాటి వీరసింహుడి తినుబండారాల, అరటి మొక్కల పంపిణి!

10) పనిలో పనిగా శాస్త్రి గారి 5,000/- చందా, కొర్రపాటి వీరుడి 510/- చందాలు!

11) 8 గంటలకు హైదరాబాదు ప్రయాణం పెట్టుకొని, DRK వైద్యుడు 6:55 దాక శివరామపురంలోనే ఉండి పోవడం.

12) ఇలాంటి తుది సమావేశానికి సుందరీకర్తల చతుష్టయం 3 కిలోమీటర్ల దూరాన ఉండిపోవడం.

            రేపటి వేకువ శ్రమదాన స్థలం కూడ శివరామపురం చివర - ప్రేమానందుని ఇంటి వద్దనే

ప్రారంభమగుననే ప్రకటన.

            మనకాలపు అద్భుతమని

అహోరాత్రులిట్లు ప్రజల ఆహ్లాదము సాధించగ

జనబాహుళ్యపు స్వస్తత మనసులందు సుస్థిరముగ

తలా 2 గంటలు తమ గ్రామముకై కష్టించుట

మనకాలపు అద్భుతమని మాత్రం చెప్పక తప్పదు!

- నల్లూరి రామారావు

   22.02.2025