3394* వ రోజు ... ....

 నారచేతి సంచులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులు దేనికటా!!

శివరాత్రికి ముందు శివరాంపురాల మధ్య శ్రమదానం! - @3394*

            సోమవారం వేకువ కూడ 4.20 – 6.15 మధ్య, కోళ్ళఫారం ఉత్తరంగా శ్రమ కొనసాగింది.

1) కోళ్ళఫారం దగ్గరి విద్యుద్దీపం వెలుగు చాలకపోవడమూ,

2) ఆకాశంలోని వక్రచంద్రుడి కాంతి బొత్తిగా మినుకు మినుకుమంటున్నందుననూ వీధి కాలుష్య సంహారం కాస్త నెమ్మదిగా సాగింది.

            పనులు నెమ్మదించడానికి మరో కారణం బాట పడమర డ్రైను. అది పిచ్చి తీగలతో, ముళ్ళ - వెర్రి మొక్కలతో క్రిక్కిరిసిపోయి ఉండడం మరో కారణం! కార్యకర్తల సంఖ్య నిన్నటి కన్న పలచబడింది ఇంకో కారణం! అదలింపుల కార్యకర్తలిద్దరు గైరుహాజరైనందున సందడి తగ్గిందనీ, ప్రశాంతంగా సాగాయనీ ఇద్దరు వేర్వేరుగా భావించారు!

            డి.ఆర్.కె. గారు తరచుగా చెప్పేట్లుగా - ఎవరికి సాధ్యమైన పనినే వారు చేసుకుపోయారు.

            కత్తుల వాళ్ళు డ్రైను చిట్టడవిని జయించారు, దంతెలవారు కత్తి వేటుల కనువుగా మొక్కల్ని అదిమి పట్టి, నరికేసిన కొమ్మల్నీ, మొక్కల్నీ, తీగల్నీ గట్టుమీద కుప్పలు పేర్చి, ఇద్దరు చీపుళ్లకు పని చెప్పి, ప్రాతూరి వారు కెమేరా  కన్ను తెరచి, నేను మందు కంపు సీసాలను ఏరి, ఒక ఆనందుడు అందరికీ మంచి నీళ్లందించి,

            85 ఏళ్ల మానవుడు “నేను రాకపోతే ఈపూట పనులింత బాగా జరిగేవా? అని జోకి, తన డ్యూటీ ప్రకారం  ఒక శ్రీనివాసుడు సకాలంలో కాఫీలు తెచ్చి, అందరికీ త్రాగించి,

            చివరి సమావేశాన్ని తూములూరి లక్ష్మణుడు నినాదాలతో ప్రారంభోత్సవం చేసి,

            నిన్న తన మెడ దగ్గర కొమ్మ పోడుచుకొన్న గాయం తగ్గిందని కస్తూరి శ్రీనుడు చూపించి,

            రేపటి వేకువ వీధి పనుల కోసం మళ్ళీ శివరామపురాల మధ్యనే కలవాలని నిర్ణయించి,

            నేటి కార్యక్రమం ముగిసింది.

            ఉప్పల బజారు వారు హిందూ శ్మశాన అభివృద్ధి కోసం 52,000/- రూపాయలను ఈరోజు అందజేసినందుకు చల్లపల్లి పౌరుల తరపున ధన్యవాదములు.  

          పరిఢవిల్లు చుండాలనె!

ఏ ఒకరిని గమనించిన – ఏ మనసును పరికించిన

ఎవరిని మాటాడించిన త్రికరణ శుద్ధిగ గమ్యం

ఒక్కటె – “ఈ పచ్చదనం ఊరంతా ప్రాకాలనె

ప్రజారోగ్య ఆనందం పరిఢవిల్లు చుండాలనె!”

- నల్లూరి రామారావు

   24.02.2025